Chandrababu: ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా: సీఎం చంద్రబాబు

Chandrababu Prioritizes Public Health Insurance of 25 Lakhs Per Family
  • గుంటూరు జిల్లాలో శంకర కంటి ఆసుప‌త్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం
  • ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు
  • శంకర ఆసుప‌త్రి నిస్వార్థ సేవలను మనస్ఫూర్తిగా అభినందించిన ముఖ్యమంత్రి
  • రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని వెల్లడి
  • సేవ చేసే సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ
అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు సేవ చేసే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా శంకర కంటి ఆసుప‌త్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. "మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో కంచి పీఠం దేశవ్యాప్తంగా ఆసుప‌త్రులు స్థాపించి అద్భుతమైన సేవలు అందిస్తోంది. 50 ఏళ్లలో 10 రాష్ట్రాల్లో 14 కంటి ఆసుప‌త్రులు నిర్మించి, ఇప్పటివరకు 30 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం సాధారణ విషయం కాదు" అని ప్రశంసించారు. గుంటూరులో 2003 నుంచి సేవలందిస్తున్న ఈ ఆసుప‌త్రి ద్వారా 4 లక్షలకు పైగా ఉచిత సర్జరీలు జరిగాయని తెలిపారు.

ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యం
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. "ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. అందుకే వినూత్నంగా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువస్తున్నాం. దీని కింద ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందిస్తాం. ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా ఉంటుంది" అని ప్రకటించారు. 

టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ 'సంజీవని' కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, 5 కోట్ల మంది ప్రజల హెల్త్ రికార్డులను ఆన్‌లైన్‌లో భద్రపరుస్తామని వివరించారు. ఆది శంకరాచార్యుల ఆకాంక్షలకు అనుగుణంగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. శంకర ఫౌండేషన్ త్వరలో జరుపుకోనున్న స్వర్ణోత్సవ కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు. 

కంచి కామకోటి పీఠం సేవలు అద్వితీయం
"ఆధ్యాత్మికంగా భక్త జనావళి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. ధర్మం, జ్ఞానం, సేవ మూల సిద్ధాంతాలుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పీఠాన్ని కొనసాగిస్తున్నారు. సామాజికంగాను పేదలను,  ఆపన్నులను ఆదుకునేందుకు కంచి కామకోటి పీఠం విశేషంగా పని చేస్తోంది. సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులోకి తెచ్చిన శంకర 'ఐ' ఆసుప‌త్రి... 1977లో ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించింది. త్వరలో స్వర్ణోత్సవంలో అడుగుపెడుతోంది. సేవే పరమావధిగా భావించే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ మార్గదర్శకత్వంలో శంకర ఫౌండేషన్ మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని సీఎం అన్నారు. 

అంతకుముందు శంకర ఆస్పత్రిలోని పలు విభాగాలను సీఎం చంద్రబాబు సందర్శించి వాటి వివరాలు తెలుసుకున్నారు. శంకర 'ఐ' ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవలను ముఖ్యమంత్రికి నిర్వాహకులు వివరించారు. అనంతరం ఆసుప‌త్రి నిర్వాహకులు ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, తంజావూరు పెయింటింగ్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు, శంకర 'ఐ' ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 
Chandrababu
Andhra Pradesh
Health Insurance
Sankara Eye Hospital
Kanchi Kamakoti Peetham
Universal Health Insurance
Health Services
Free Eye Surgery
Digital Nerve Center
Sanjeevani

More Telugu News