Donald Trump: ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు.. ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Announces 2000 Dollar Payment to Each American
  • అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ భారీ హామీ
  • టారిఫ్ పన్నుల ఆదాయం నుంచి నగదు పంపిణీ చేస్తామన్న అధ్యక్షుడు
  • ప్రతి పౌరుడికి కనీసం 2వేల డాల‌ర్లు ఇస్తామని ప్రకటన
  • సంపన్నులకు ఈ పథకం వర్తించదని స్పష్టీక‌ర‌ణ‌
  • టారిఫ్ విధానాన్ని విమర్శించేవాళ్లు మూర్ఖులంటూ విమ‌ర్శ‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడైన టారిఫ్ విధానాన్ని సమర్థించుకుంటూ సంచలన ప్రకటన చేశారు. తన ప్రభుత్వం టారిఫ్ పన్నుల ద్వారా వసూలు చేస్తున్న ఆదాయం నుంచి త్వరలోనే ప్రతి అమెరికన్‌కు కనీసం 2వేల డాల‌ర్ల‌ చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధిక ఆదాయం ఉన్న సంపన్నులకు ఈ పథకం వర్తించదని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ ప్రకటన చేశారు. తన టారిఫ్ విధానాన్ని విమర్శిస్తున్న వారిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "టారిఫ్‌లను వ్యతిరేకించేవాళ్లు మూర్ఖులు!" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన హయాంలోనే అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న, గౌరవనీయమైన దేశంగా మారిందని, ద్రవ్యోల్బణం దాదాపు లేదని, స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

టారిఫ్ పన్నుల ద్వారా దేశానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం వస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిధులతో 37 ట్రిలియన్ డాలర్ల జాతీయ రుణాన్ని తగ్గించడం ప్రారంభిస్తామని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు డివిడెండ్ రూపంలో ఈ నగదును అందిస్తామని వివరించారు.

అయితే, ఈ 2వేల డాల‌ర్ల‌ డివిడెండ్‌ను ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారు? ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది? వంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గత ఆగస్టులో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. టారిఫ్ ఆదాయాన్ని ప్రధానంగా 38.12 ట్రిలియన్ డాలర్ల జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వినియోగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

మరోవైపు దాదాపు అన్ని ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ న్యాయపరమైన సవాళ్లను ట్రంప్ తోసిపుచ్చారు. టారిఫ్‌లే తన బలమైన ఆర్థిక ఆయుధమని, ఈ విధానం అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా, స్వతంత్రంగా మార్చిందని ఆయన పునరుద్ఘాటించారు.
Donald Trump
America
Tariffs
US Economy
National Debt
Truth Social
Scott Bessent
US Treasury
Trade
Supreme Court

More Telugu News