Mohan Bhagwat: ముస్లింలు ఆర్ఎస్ఎస్ లో చేరొచ్చా?... మోహన్ భగవత్ సమాధానం ఇదే!

Mohan Bhagwat on Muslims Joining RSS
  • ఆర్ఎస్ఎస్‌లోకి వచ్చే వారు మతాన్ని పక్కనపెట్టి రావాలన్న భగవత్
  • సంఘ్‌లోకి అడుగుపెట్టే వారంతా భారతమాత బిడ్డలేనని వెల్లడి
  • ఆర్ఎస్ఎస్‌ను రిజిస్టర్ చేయాల్సిన అవసరం చట్ట ప్రకారం లేదని స్పష్టీకరణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ముస్లింలు చేరవచ్చా? అనే ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా సంఘ్‌లోకి వచ్చేటప్పుడు తమ మతపరమైన గుర్తింపును పక్కనపెట్టి రావాలని స్పష్టం చేశారు. 

"సంఘ్‌లో బ్రాహ్మణులకు, ఇతర కులాల వారికి, ముస్లింలకు, క్రైస్తవులకు అంటూ ప్రత్యేకంగా ప్రవేశం ఏమీ ఉండదు. ఆర్ఎస్ఎస్ లోకి వచ్చేటప్పుడు మీరు భారతమాత బిడ్డగా మాత్రమే రావాలి" అని ఆయన వివరించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వస్తున్నారని, అయితే తాము వారి సంఖ్యను లెక్కించబోమని, వారి వివరాలు అడగబోమని తెలిపారు.

ఆర్ఎస్ఎస్ ను ఎందుకు రిజిస్టర్ చేయలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. "సంఘ్ 1925లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. అప్పుడు వారితో రిజిస్టర్ చేయించుకోవాలని మీరు ఆశిస్తున్నారా? స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన చట్టాలు కూడా రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయలేదు. 

చట్ట ప్రకారం మేం 'వ్యక్తుల సమూహం' (బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్)గా గుర్తింపు పొందాం. ప్రభుత్వం మమ్మల్ని మూడుసార్లు నిషేధించింది... అంటే మమ్మల్ని గుర్తించినట్లే కదా? కోర్టులు కూడా ప్రతిసారీ ఆ నిషేధాన్ని కొట్టివేశాయి. హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ లేదు కదా? అలాగే మాకు కూడా అవసరం లేదు" అని ఆయన వివరించారు.

Mohan Bhagwat
RSS
Rashtriya Swayamsevak Sangh
Muslims in RSS
Hindu Dharma
RSS Registration
Bengaluru
RSS Centenary Celebrations
Indian Culture

More Telugu News