Nara Lokesh: పాట్నా చేరుకున్న నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు

Nara Lokesh Reaches Patna for Bihar Election Campaign Welcomed by BJP Leaders
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున లోకేశ్ ప్రచారం
  • నేడు పారిశ్రామికవేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశం
  • రేపు పాట్నాలో బహిరంగ సభలో ప్రసంగం
  • యువతకు ఉద్యోగాల కల్పనే ప్రధాన ప్రచారాంశం
  • ఏపీకి పరిశ్రమలు తెచ్చిన అనుభవంతో లోకేశ్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే తరఫున పాలుపంచుకునేందుకు శనివారం పాట్నా చేరుకున్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి వచ్చిన ఆయనకు స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీహార్ పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నవంబర్ 6న తొలి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 9 సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో, చివరి రెండు రోజులు లోకేశ్ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం రెండు కీలక సమావేశాల్లో పాల్గొని, ఆదివారం పాట్నాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఉద్యోగాల కల్పనే ప్రధాన అస్త్రం

బీహార్ యువత ఎదుర్కొంటున్న వలసల సమస్యను, నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని ఎన్డీఏ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులను ఆకర్షించడంలో లోకేశ్ చూపిన చొరవను ఎన్డీఏ ప్రత్యేకంగా పరిగణించింది. ఆయన అనుభవాన్ని బీహార్ యువతకు వివరిస్తే, ఉద్యోగాల కల్పనపై ఎన్డీఏ ఇస్తున్న హామీలకు విశ్వసనీయత పెరుగుతుందని భావిస్తోంది.

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు ఉత్తరాదిలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై లోకేశ్ ద్వారా ప్రచారం చేయిస్తేనే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్డీఏ నేతలు భావించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే బీహార్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని, స్కిల్స్ సెన్సస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని లోకేశ్ తన ప్రచారంలో వివరించనున్నారు. ఆయన ప్రచారంతో యువత మద్దతు కూడగట్టవచ్చని ఎన్డీఏ కూటమి విశ్వాసంతో ఉంది.
Nara Lokesh
Bihar Elections
Andhra Pradesh
TDP
NDA
Pawan Kalyan
Chandrababu Naidu
Job Creation
Google Data Center
Skill Census

More Telugu News