Pawan Kalyan: ఆపరేషన్ మొదలైతే ఆగదు... ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan Warns Red Sanders Smugglers
  • ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్న పవన్ కల్యాణ్
  • నలుగురు కీలక స్మగ్లర్లను గుర్తించామని వెల్లడి
  • తిరుపతిలో అటవీ ప్రాంతాలు, గోదాములను పరిశీలించిన  అటవీశాఖ మంత్రి 
  • స్మగ్లింగ్ కట్టడికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడి
  • అక్రమార్కుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని తీవ్ర హెచ్చరిక
  • చెట్ల నరికివేతలో పాలుపంచుకోవద్దని స్థానికులకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించామని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన, మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఎర్రచందనం చెట్టుకు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన సంపదను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల చెట్లను నరికి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంపై సీఎం సిద్దరామయ్యను కోరినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. "ఇప్పటికే నలుగురు ప్రధాన స్మగ్లర్లను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకసారి ఆపరేషన్ మొదలుపెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. 'ఆపరేషన్ కగార్‌'ను అమలు చేస్తున్న ఈ దేశంలో స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద కష్టం కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

స్మగ్లర్లు స్వచ్ఛందంగా ఈ అక్రమ కార్యకలాపాలను ఆపకపోతే అటవీ చట్టం ప్రకారం వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఈ అక్రమ నరికివేతలో స్థానిక ప్రజలు, తమిళనాడు కూలీలు భాగస్వాములు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎర్రచందనాన్ని కాపాడే బాధ్యత వేంకటేశ్వరస్వామి భక్తులపై కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.
Pawan Kalyan
red sandalwood
red sanders smuggling
Andhra Pradesh
forest department
smugglers
Operation Kagar
Seshachalam forests
Tirupati
Karnataka government

More Telugu News