Sajjanar: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు

Sajjanar issues key orders for Jubilee Hills by election
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పోలీసుల ప్రత్యేక ఆంక్షలు
  • మద్యం దుకాణాలు, హోటళ్లు మూసివేత
  • నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ విధింపు
  • పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురికి మించి గుమికూడొద్దు
  • ఓట్ల లెక్కింపు రోజు టపాసులు పేల్చడంపై నిషేధం
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు వీలుగా నియోజకవర్గ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా ఈ నెల 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గం పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరగనున్న 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు మళ్లీ అమల్లో ఉంటాయని వివరించారు.

పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. అదేవిధంగా, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై టపాసులు పేల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం వంటి వాటిపై నిషేధం ఉంటుందని తెలిపారు. పోలీసు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Sajjanar
Jubilee Hills by-election
Hyderabad CP
Hyderabad police
Section 144
Liquor ban
Telangana elections
Hyderabad elections
Polling restrictions
Vote counting

More Telugu News