Kavitha: సీఎం రేవంత్ భాష వీధి రౌడీలా ఉంది: కవిత తీవ్ర విమర్శలు

Kavitha Criticizes CM Revanth Reddys Language
  • ఫీజు బకాయిలు చెల్లించకుండా బెదిరింపులా అని కవిత ఫైర్
  • కాలేజీ యాజమాన్యాల తాట తీస్తామనడం దారుణమని విమర్శ
  • మాట తప్పింది మీరు, బంద్‌కు కారణమూ మీరేనని ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను "తాట తీస్తా, తొక్కుతా" అంటూ సీఎం హెచ్చరించడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఎం వాడిన భాష వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా ఉందని ఘాటుగా విమర్శించారు.

‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కవిత, హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతోనే కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. మాట తప్పింది మీరు. అలాంటప్పుడు వారి తాట, తోలు తీస్తామని అనడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడిన వారిపై మీ వీరంగమా?" అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, యాజమాన్యాలను బెదిరించే ధోరణి అవలంబిస్తోందని కవిత ఆరోపించారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తాము అండగా ఉంటామని, వారి తరఫున పోరాడతామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ, బెదిరింపులతో కాదని హితవు పలికారు. 
Kavitha
Kalvakuntla Kavitha
Revanth Reddy
Telangana
Fee Reimbursement
Private Colleges
Warangal
Telangana Jagruthi
MLC Kavitha
Telangana Politics

More Telugu News