Pawan Kalyan: కాలినడకన మామండూరు అడవుల్లో తిరిగిన మంత్రి పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan Field Inspection in Mamanduru Forests
  • అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం, 2 కిలోమీటర్ల కాలినడక
  • ఎర్రచందనం, అరుదైన మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న పవన్
  • రిజర్వ్ ఫారెస్ట్ వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతం పరిశీలన
  • ఎర్రచందనం స్మగ్లింగ్, నిరోధక చర్యలపై అధికారులతో సమీక్ష
  • గుంటి మడుగు వాగు వద్ద కూర్చుని పరిసరాలను ఆసక్తిగా గమనించిన వైనం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవి లోపలికి వెళ్లారు. దారి పొడవునా ప్రతి చెట్టును, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు.

అనంతరం నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్‌ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటి మడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మంత్రి దృష్టి సారించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు, టాస్క్‌ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల గురించి అధికారులతో సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వారికి పలు సూచనలు చేశారు.

మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఇక, తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను కూడా పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. 

Pawan Kalyan
Pawan Kalyan forest visit
AP Forest Minister
Mamanduru Forest
Red Sanders Smuggling
Seshachalam Forests
Tirupati
Forest Conservation
AP Deputy CM
Forestry

More Telugu News