ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు: కిషన్ రెడ్డి

  • ఎన్నికల హామీల అమలులో రేవంత్ విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి
  • హైకమాండ్‌కు భయపడే కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ
  • తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్, కేసీఆర్‌కు సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి తనపైన, బీజేపీపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? ఆ హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఆ విషయం పక్కన పెట్టి బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాలే చేశారు. నాపై ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడేది లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ సర్టిఫికెట్‌ అస్సలు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు" అని కిషన్ రెడ్డి అన్నారు.

తమది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా అవినీతి, కుటుంబ పార్టీ కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మాత్రమే బీజేపీకి తెలుసని, తమ పాలనపై ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని గుర్తుచేశారు. ఫేక్ వీడియోలతో తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

"కాంగ్రెస్ హైకమాండ్‌కు భయపడి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ అభివృద్ధిపై నేను చేసిన పనుల గురించి వివరణ వినే ధైర్యం కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి ఉందా?" అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైన 'ఫెయిల్యూర్ ప్రభుత్వం' అని ఆయన దుయ్యబట్టారు. 


More Telugu News