హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. భారతీయుల్లో టెన్షన్

  • హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై అమెరికాలో భారీ విచారణ
  • 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' పేరుతో 175 కేసులపై దర్యాప్తు ప్రారంభం
  • అమెరికన్ల ఉద్యోగాలకే మా తొలి ప్రాధాన్యత అన్న ట్రంప్ సర్కార్
  • విశ్వవిద్యాలయాల్లో హెచ్‌-1బీ వీసాలను రద్దు చేసిన ఫ్లోరిడా గవర్నర్
  • 2024లో 70 శాతానికి పైగా వీసాలు పొందిన భారతీయులు
అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ (H-1B) వీసా కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఈ వీసాల దుర్వినియోగానికి సంబంధించి అమెరికా కార్మిక శాఖ (DOL) ఏకంగా 175 కేసులపై దర్యాప్తు ప్రారంభించింది. 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' పేరుతో సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఫాక్స్ న్యూస్ శుక్రవారం తన కథనంలో వెల్లడించింది.

అమెరికాలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇంజినీరింగ్, వైద్య రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అక్కడి కంపెనీలకు హెచ్‌-1బీ వీసా వీలు కల్పిస్తుంది. అయితే, ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులు ముమ్మరం చేసింది. 

"హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు కార్మిక శాఖ తన వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉపయోగిస్తోంది" అని కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డెరెమర్ 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడి నాయకత్వంలో అమెరికన్లకే ఉన్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు దక్కేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ దర్యాప్తుల వార్తను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ధ్రువీకరించారు.

ఇటీవల కాలంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలపై అనేక కఠిన చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్‌లో కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజును విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిని తొలగించి, ఆ స్థానాల్లో స్థానికులను నియమించాలని ఆదేశించారు. 

ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తున్న వ్యాపార వర్గాలు, డెమోక్రాటిక్ నేతలు
అయితే, ట్రంప్ ప్రభుత్వ చర్యలపై వ్యాపార వర్గాలు, చట్టసభ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సహా పలు సంస్థలు ప్రభుత్వంపై కోర్టుల్లో దావాలు వేశాయి. అక్టోబర్ 30న ఐదుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడికి లేఖ రాస్తూ, హెచ్‌-1బీ వీసాలపై తీసుకున్న నిర్ణయాలు భారత్-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హెచ్‌-1బీ వీసాలపై వచ్చిన వారే అమెరికాలో అనేక విజయవంతమైన కంపెనీలను స్థాపించి, ఉద్యోగాలు సృష్టించారని వారు గుర్తుచేశారు.

గ‌తేడాది 70 శాతానికి పైగా వీసాలు భారతీయులకే..
గణాంకాల ప్రకారం 2024లో జారీ అయిన మొత్తం హెచ్‌-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందారు. తాజా పరిణామాలతో అమెరికాలో పనిచేస్తున్న, పనిచేయాలనుకుంటున్న వేలాది మంది భారతీయ నిపుణుల్లో ఆందోళన నెలకొంది.


More Telugu News