Bhanu Prakash Reddy: పరకామణి దోషులకు జైలు తప్పదు: కరుణాకర్ రెడ్డిపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్

TTD Board Member Bhanu Prakash Reddy Warns Karnakar Reddy on Parakamani Case
  • శ్రీవారి ఖజానాను కరుణాకర్ రెడ్డి అండ్ కో దోచుకున్నారన్న భానుప్రకాశ్ రెడ్డి
  • దొంగలతో లోకాయుక్తలో రాజీ చేస్తారా అని ప్రశ్న
  • బహిరంగ చర్చకు రావాలని కరుణాకర్ రెడ్డికి సవాల్
టీటీడీ పరకామణి కేసులో దోషులు కచ్చితంగా జైలుకు వెళతారని, శ్రీవారి ఖజానాను దోచుకున్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన బృందాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దొంగను దాతగా, దొంగతనాన్ని కానుకగా మార్చిన వారు ఇప్పుడు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పరకామణిలో జరిగిన అక్రమాలపై కరుణాకర్ రెడ్డి అండ్ కో సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. "పరకామణి విషయంలో దొంగలను వెంటబెట్టుకుని లోకాయుక్తకు వెళ్లి కరుణాకర్ రెడ్డి ఎలా రాజీ చేస్తారు? ఆనాడు దీనికి సంబంధించిన తీర్మానాలపై సంతకాలు చేసింది మీరు కాదా?" అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

"శ్రీనివాసుడు ఇప్పుడు ఉగ్ర నరసింహుడిగా మారారు. తన ఖజానాకు కన్నం వేసిన కరుణాకర్ రెడ్డి బృందాన్ని శ్రీవారు కచ్చితంగా శిక్షిస్తారు. వడ్డీకాసుల వాడు.. వడ్డీతో సహా వారి నుంచి వసూలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి" అని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. పరకామణి అనేది అత్యంత సున్నితమైన అంశమని, కరుణాకర్ రెడ్డి చెబుతున్న అబద్ధాలను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Bhanu Prakash Reddy
TTD
Tirumala
Karnakar Reddy
Parakamani case
TTD Board
corruption allegations
Andhra Pradesh
Tirupati
Sri Venkateswara Swamy

More Telugu News