Harish Rao: రేవంత్ రెడ్డి సినిమా హీరోలను జైల్లో పెట్టారు!: హరీశ్ రావు

Harish Rao Slams Revanth Reddy for Jailing Movie Stars
  • ఓట్ల కోసం ఈరోజు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శ
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడేళ్లు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిక
  • రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో నలుగురు సోదరులు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఎద్దేవా
సినిమా హీరోలను జైల్లో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు సినిమా కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన 'మీట్ ది ప్రెస్'లో మాట్లాడుతూ, జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మూడేళ్ల పాటు నరకయాతన తప్పదని హెచ్చరించారు. వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు ఏది కావాలో తేల్చుకోవాలని కోరారు.

రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో నలుగురు సోదరులు మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసి జూబ్లీహిల్స్‌లో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే రేషన్ కార్డులు ఆగిపోతాయని, పెన్షన్ పెరగదని చెప్పడం సరికాదని హితవు పలికారు.

కంటోన్మెంట్‌లో 6 వేల డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏమయ్యాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని విమర్శించారు. రెండేళ్లుగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వని కాంగ్రెస్, జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడిచ్చిందని ఆరోపించారు. పీజేఆర్ మీద రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అంతగా అభిమానం ఉంటే 2023లో పీజేఆర్ కుమారుడికి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.
Harish Rao
Revanth Reddy
Telangana politics
Jubilee Hills election
BRS party
Congress party

More Telugu News