ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. ఐసీసీకి చేరిన పంచాయితీ!

  • ఆసియా కప్ గెలిచి 6 వారాలైనా టీమిండియాకు అందని ట్రోఫీ
  • ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్న బీసీసీఐ
  • నఖ్వీ ద్వంద్వ పదవులపైనా అభ్యంతరం
  • బీసీసీఐకి మద్దతు తెలపనున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు
ఆసియా కప్-2025 ట్రోఫీ చుట్టూ అలముకున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. టోర్నీ గెలిచి ఆరు వారాలు కావస్తున్నా విజేత ట్రోఫీ ఇప్పటికీ భారత జట్టుకు అందలేదు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వారం దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ ప్రవర్తనపై ఫిర్యాదు చేయనుంది.

సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు, పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని, పతకాలను స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో భారత జట్టు వేచి చూస్తుండగానే నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ అసాధారణ పరిణామంపై బీసీసీఐ ఇప్పటికే ఏసీసీకి అధికారికంగా లేఖ రాసింది. పది రోజుల క్రితం లేఖ పంపినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. శుక్రవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ట్రోఫీ అప్పగింత అంశాన్ని బీసీసీఐ బలంగా ప్రస్తావించనుంది.

ట్రోఫీ వివాదంతో పాటు, మోసిన్ నఖ్వీ ఏకకాలంలో పీసీబీ చైర్మన్‌గా, ఏసీసీ అధ్యక్షుడిగా, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కొనసాగడంపైనా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే వ్యక్తి ప్రభుత్వ, క్రీడా పదవుల్లో ఉండటం ఐసీసీ పాలనా నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ వాదించనుంది. ఈ విషయంలో బీసీసీఐకి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్థాన్ జరిపిన సైనిక దాడిలో తమ దేశవాళీ క్రికెటర్లు మరణించారని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్థాన్, పాక్‌తో త్రైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 


More Telugu News