పదేళ్లలో తొలిసారి.. జలకళతో ఏపీ జలాశయాలు

  • గత దశాబ్ద కాలంలో లేనంతగా నిండిన రాష్ట్రంలోని చెరువులు
  • రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో 132 టీఎంసీలకు పైగా నీటి నిల్వ
  • సుమారు 20,000 చెరువులు వంద శాతం జలకళతో కళకళ
  • ప్రధాన జలాశయాల్లో 1004 టీఎంసీలు దాటిన నీటిమట్టం
  • నిండుకుండలా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా చెరువులు నిండుకుండలా మారాయి. అటు ప్రధాన ప్రాజెక్టులు సైతం గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో రాష్ట్రంలో జల సంపద సమృద్ధిగా కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38,628 చెరువులు ఉండగా, వాటి పూర్తి నిల్వ సామర్థ్యం 206.21 టీఎంసీలు. ప్రస్తుతం ఈ చెరువుల్లో 132.64 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఇది గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయి కావడం గమనార్హం. వీటిలో దాదాపు 19,685 చెరువులు వంద శాతం నిండిపోయాయి. మరో 7,048 చెరువులు 75 శాతానికి పైగా నిండాయి. కోస్తాంధ్రలోని 26,487 చెరువుల్లో 85.85 టీఎంసీలు, రాయలసీమలోని 12,141 చెరువుల్లో 46.79 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో 849.70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రధాన జలాశయాల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 1004.48 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 97.32 శాతం నిండింది. నాగార్జునసాగర్‌ జలాశయం తన గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 311.45 టీఎంసీల (99.81%) నీటితో కళకళలాడుతోంది. సాగర్‌కు ఎగువ నుంచి 46,305 క్యూసెక్కుల వరద వస్తుండగా, 33,236 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

పులిచింతల ప్రాజెక్టు సైతం 45.77 టీఎంసీల సామర్థ్యానికి గాను 44.59 టీఎంసీల (97.42%) నీటితో నిండిపోయింది. ఇక ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి (3.07 టీఎంసీలు) చేరడంతో, ఎగువ నుంచి వస్తున్న 48,699 క్యూసెక్కుల వరద నీటిని యథాతథంగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో జలవనరులు సమృద్ధిగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News