జూబ్లీహిల్స్‌లో బలగాలని దించండి: ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి

  • రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున కేంద్ర బలగాలను దించాలని విజ్ఞప్తి
  • హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొన్న బీఆర్ఎస్
  • పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తారనే నమ్మకం లేదని వెల్లడి
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి అల్లర్లు సృష్టించి రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున కేంద్ర బలగాలను దించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నందున, పోలీసులు ఎన్నికలలో పారదర్శకంగా వ్యవహరిస్తారనే నమ్మకం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కూడా సీఈసీకి ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజున మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, తక్షణమే కేంద్ర బలగాలను నియమించాలని కోరింది.

రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు

ఎన్నికల ప్రచారం సమయంలో ముస్లింలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనను కలిశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News