టీ20 వరల్డ్ కప్ 2026 వేదికలు ఖరారు.. ఫైనల్ ఆ స్టేడియంలోనే!

  • భారత్‌లో ఐదు, శ్రీలంకలో రెండు వేదికల ఎంపిక
  • ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోనే జరిగే అవకాశం
  • భద్రతా కారణాలతో బెంగళూరుకు దక్కని చోటు
  • ఈసారి మెట్రో నగరాలకే ఐసీసీ ప్రాధాన్యత
  • సెమీస్‌కు చేరితే స్వదేశంలోనే మ్యాచ్ ఆడనున్న శ్రీలంక
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక వేదికలను ఖరారు చేసింది. భారత్‌లో ఐదు ప్రధాన నగరాలను, శ్రీలంకలో రెండు వేదికలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ సమాచారం ప్రకారం భారత్‌లో అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలను మ్యాచ్‌ల నిర్వహణకు ఎంపిక చేశారు. అయితే, ఊహించినట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. గత జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను బీసీసీఐ చిన్న నగరాల్లో నిర్వహించింది. అయితే, 20 జట్లు పాల్గొనే టీ20 ప్రపంచకప్‌కు భద్రత అత్యంత కీలకమని భావిస్తున్న ఐసీసీ, ఈసారి కేవలం టైర్-1, మెట్రో నగరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే, తుదిపోరును కొలంబోలో నిర్వహించేందుకు శ్రీలంకను బ్యాకప్ ఆప్షన్‌గా ఉంచారు. అలాగే శ్రీలంక జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్‌ను స్వదేశంలోనే ఆడేలా ఐసీసీ.. బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


More Telugu News