ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యాఖ్యలు.. నిర్మలా సీతారామన్‌పై బ్యాంకు యూనియన్ల తీవ్ర ఆగ్రహం

  • ప్రైవేటీకరణ జాతీయ ప్రయోజనాలకు విఘాతమనే ఆందోళన సరికాదన్న నిర్మలా సీతారామన్
  • నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండించిన బ్యాంకు యూనియన్లు
  • దేశానికి సేవ చేస్తున్న బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశాలు మానుకోవాలని సూచన
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సంఘటితానికి, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు సరికావన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బ్యాంకు యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ, దేశానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతో సేవ చేస్తున్నాయని పేర్కొన్నాయి. అలాంటి బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలను మానుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

మూలధన సాయం అందించి ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు 9 ట్రేడ్ యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనను విడుదల చేసింది.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 90 శాతం ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయని గుర్తు చేసింది. ప్రాధాన్యతా రంగాలకు, ప్రభుత్వ పథకాలు ఈ బ్యాంకుల ద్వారానే అందుతున్నాయని తెలిపింది. గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే సాధ్యమైందని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటానికి ప్రభుత్వ రంగ బ్యాంకులే కారణమని వెల్లడించింది. అలాంటి బ్యాంకులను ప్రైవేటీకరిస్తే కార్పోరేట్లకే ప్రయోజనం చేకూరుతుందని, ప్రజలకు కాదని తెలిపింది. ప్రైవేటీకరణ జాతి ప్రయోజనాలకు విఘాతమేనని పేర్కొంది.

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, పార్లమెంటు వేదికగా చర్చ జరగాలని గుర్తు చేసింది. జాతీయీకరణ కంటే ముందు బ్యాంకులు పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు లక్షలాది గ్రామాలకు విస్తరించగా, ప్రైవేటు బ్యాంకులు గ్రామీణ స్థాయిలో నామమాత్రంగానే సేవలు అందిస్తున్నాయని తెలిపింది. ఆర్థిక మాంద్యం, కొవిడ్ సమయాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి వెన్నుదన్నుగా నిలిచాయని వెల్లడించింది.


More Telugu News