బాలు మోకాళ్లపై కూర్చుని చేసిన రిక్వెస్ట్ అది: మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్

  • సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ కి మంచి పేరు 
  • ఆయన నుంచి వచ్చిన అనేక హిట్ సాంగ్స్ 
  • 'కర్ణ' సినిమాలోని పాట గురించిన ప్రస్తావన 
  • బాలు చేసిన రిక్వెస్ట్ గురించి చెప్పిన విద్యాసాగర్  

సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ కి ఎంతో పేరు ఉంది. ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు భారీ విజయాలను అందుకోవడంలో ఆయన పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి. అలాంటి విద్యాసాగర్ తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన కెరియర్లో గుర్తుండిపోయిన కొన్ని విషయాలను గురించి ప్రస్తావించారు. అలా ఆయన తాను సంగీతాన్ని అందించిన 'కర్ణ' సినిమాను గురించి మాట్లాడారు. 

'కర్ణ' సినిమా కోసం నేను ఒక ట్యూన్ చేశాను. జానకిగారు వచ్చి తనకి సంబంధించిన పల్లవి - చరణాలను పాడేసి వెళ్లిపోయారు. ఇక బాలుగారు పాడవలసి ఉంది. ఆ రోజున బాలుగారు నేను కంపోజ్ చేసిన వేరే పాటను పాడేసి ఇంటికి బయలుదేరుతున్నారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు అయింది. అప్పట్లో గొంతు సమస్యతో బాధపడుతున్న ఆయన, 6 తరువాత పాడేవారు కాదు. అందువలన 'కర్ణ' కోసం జానకిగారు పాడింది ఒకసారి వినేసి, మరునాడు ఉదయం పాడమని అన్నాను. దాంతో ఆయన ఆ పాట విన్నారు. అదే అర్జున్ - రంజిత నటించిన 'కర్ణ' సినిమాలోని 'మలరే మౌనమా .. మౌనమే వేదమా' అనే పాట" అని చెప్పారు.  

'జానకి గారు పాడిన పాట వినగానే, ఆయన ఇంటికి వెళ్లే ఆలోచన మానుకుని, ఆ పాటను పాడారు. ఆ పాట బాగా రావడం కోసం మళ్లీ మళ్లీ పాడారు. అలా రాత్రి 11:30 గంటల వరకూ పాడుతూనే ఉన్నారు. ఆ తరువాత రికార్డింగ్ థియేటర్లో నుంచి బయటికి రాగానే, అక్కడే ఉన్న దర్శకుడి ముందు మోకాళ్లపై కూర్చున్నారు. ఇలాంటి ఒక మంచి పాట పుష్కరానికి ఒకసారి పూసే పువ్వులాంటిది. అరుదైన ఈ పాటలో చిత్రీకరణ పరంగా అశ్లీలత లేకుండా చూడండి. ఎవరు ఎప్పుడు చూసినా రమ్యంగా అనిపించేలా తీయండి అని బాలుగారు రిక్వెస్ట్ చేశారు" అని ఆనాటి సంఘటనను వివరించారు. 



More Telugu News