ఓటు చోరీ ఆరోపణలో కొత్త మలుపు... రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన మహిళ

  • ఓటు చోరీ జరిగిందంటూ వీడియోలో ఒక మహిళను ఉదహరించిన రాహుల్ గాంధీ
  • ఓటు చోరీ జరిగిందని తాను భావించడం లేదని చెప్పిన హర్యానా మహిళ
  • రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం
రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణ కొత్త మలుపు తిరిగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఈ మేరకు ఒక వీడియోను చూపించారు. అయితే ఆ వీడియోలో కనిపించిన మహిళ రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీంతో బీజేపీ కూడా కాంగ్రెస్ మీద విమర్శలు పెంచింది.

రాహుల్ గాంధీ నకిలీ వార్తలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారని, దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి బుధవారం ఒక వీడియోను పోస్టు చేశారు. రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌‌లో కనిపించిన మహిళ ఓటు చోరీని తిరస్కరించిందని తెలిపారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పి తన వీడియోను తప్పుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారని, రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు.

అంతకుముందు, రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానా ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటు దుర్వినియోగం జరిగిందని అన్నారు. తన ప్రజెంటేషన్‌లో రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాలిక్‌పూర్ గ్రామానికి చెందిన అంజలి త్యాగి అనే మహిళ వీడియోను రాహుల్ గాంధీ ప్రదర్శించారు.

లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన అంజలి త్యాగి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రం తన పేరు జాబితాలో కనిపించలేదని చెప్పారు. దీంతో తాను జూన్ నెలలో ఓటరు కార్డు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని అంజలి త్యాగి చెప్పినట్లుగా రాహుల్ గాంధీ వెల్లడించారు.

అయితే, బీజేపీ మరో వీడియోను షేర్ చేసింది. ఇందులో అంజలి త్యాగి మాట్లాడుతూ బీజేపీ ఓటు చోరీ చేసిందని తాను భావించడం లేదని పేర్కొన్నారు. పొరపాటున తన ఓటును తొలగించి ఉంటారని, దేశంలో 140 కోట్ల మంది ఉన్నారని, ఇక్కడ ఓటు చోరీ జరగదని, అనుకోకుండా జరిగి ఉంటుందని ఆ వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందని తాను భావించడం లేదని ఆమె అన్నారు.


More Telugu News