తనను ఎందుకు పక్కన పెట్టామో అర్ష్‌దీప్ సింగ్‌ అర్థం చేసుకున్నాడు: కోచ్ మోర్నీ మోర్కెల్

  • అర్ష్‌దీప్ సింగ్ చాలా అనుభవం కలిగిన ఆటగాడని కితాబు
  • జట్టుకు అతడి విలువ ఏమిటో తెలుసన్న మోర్నీ మోర్కెల్
  • వివిధ కాంబినేషన్లకు ప్రయత్నించామని, ఇది అతను చేసుకున్నాడని వ్యాఖ్య
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో తనను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ అర్థం చేసుకున్నాడని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. క్వీన్ లాండ్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య గురువారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

అర్ష్‌దీప్ సింగ్ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడని, ప్రపంచస్థాయి బౌలర్ అని ఆయన ప్రశంసించాడు. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడని తెలిపాడు. జట్టుకు అతడి విలువ ఏమిటో తమకు తెలుసని వ్యాఖ్యానించాడు. అయితే ఈ పర్యటనలో తాము వివిధ కాంబినేషన్లను ప్రయత్నించామని, ఇది అర్ష్‌దీప్ సింగ్‌ అర్థం చేసుకున్నాడని అన్నాడు.

జట్టు ఎంపిక అనేది కేవలం మేనేజ్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కాదని, ఆటగాళ్లకు కూడా ఒక సవాలేనని ఆయన పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో భిన్న కూర్పులకు ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. దీనివల్ల ఆటగాళ్లు తమకు అవకాశం రాలేదని నిరుత్సాహపడే అవకాశం ఉంటుందని, కానీ మేనేజ్‌మెంట్ ఆలోచన మరో విధంగా ఉంటుందని ఆయన వెల్లడించాడు.

ఆటగాళ్లను మరింత శ్రమించేలా ప్రోత్సహిస్తామని, ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేలా వారిని సన్నద్ధం చేస్తామని ఆయన అన్నాడు. ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది పరీక్షిస్తున్నామని, వారి సామర్థ్యంపై తమకు నమ్మకం ఉందని, మ్యాచ్‌లను ఎలా గెలవాలనే దానిపై దృష్టి సారిస్తున్నామని మోర్కెల్ స్పష్టం చేశాడు.


More Telugu News