భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 91.7 శాతం పూర్తయినందుకు సంతోషంగా ఉంది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

  • విమానాశ్రయ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
  • 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటన
  • ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్‌లో మార్పులకు సూచన
  • ప్రపంచస్థాయి ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని జీఎంఆర్, ఎల్&టీలకు ఆదేశం
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిన్న ఈ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు 91.7 శాతం పనులు పూర్తయ్యాయని, 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసి దేశానికి అంకితం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రధాన టెర్మినల్ భవనం, అరైవల్-డిపార్చర్ జోన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి కీలక నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానాశ్రయ డిజైన్‌లో ఉత్తరాంధ్ర ప్రాంత సాంస్కృతిక వైభవం, ప్రత్యేకత ప్రతిబింబించేలా మార్పులు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్, ఎల్&టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగిలిన పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ప్రతి అంశంలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల దార్శనిక నాయకత్వంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పర్యాటక రంగాలకు ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన అన్నారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు, జిల్లా అధికారులు, జీఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థల అధికారులు పాల్గొన్నారు. 


More Telugu News