Mithali Raj: అప్పట్లో భారత మహిళల క్రికెట్ పారితోషికాలు మరీ అంత తక్కువా?

Mithali Raj on Early Struggles of Indian Women Cricketers
  • ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
  • మొత్తం రూ.51 కోట్ల బహుమతిని ప్రకటించిన బోర్డు
  • వైరల్ అవుతున్న భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పాత ఇంటర్వ్యూ
  • 2005 ప్రపంచకప్‌లో మ్యాచ్‌కు వెయ్యి రూపాయలే ఇచ్చారని వెల్లడి
  • బీసీసీఐలో విలీనం తర్వాతే మహిళల క్రికెట్ దశ మారిందని వ్యాఖ్య
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయం సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టుకు రూ.51 కోట్ల భారీ నజరానాతో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఐసీసీ నుంచి ప్రైజ్‌మనీ కింద మరో రూ.39.87 కోట్లు కూడా అందనున్నాయి. మహిళల జట్టుపై ఇలా కాసుల వర్షం కురుస్తున్న వేళ, ఒకప్పుడు వారికి కనీసం మ్యాచ్ ఫీజులు కూడా ఉండేవి కావని భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో ఓ ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ మాట్లాడుతూ మహిళల క్రికెట్ ప్రస్థానంలోని కష్టాలను గుర్తు చేసుకున్నారు. "ఒకప్పుడు మాకు వార్షిక కాంట్రాక్టులు గానీ, మ్యాచ్ ఫీజులు గానీ ఉండేవి కావు. 2005 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచినప్పుడు కూడా ఒక్కో మ్యాచ్‌కు కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా కేవలం ఆ టోర్నమెంట్‌కు మాత్రమే పరిమితం. అప్పట్లో మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదాయం వచ్చేది కాదు, అందుకే ఫీజులు అడిగే పరిస్థితి ఉండేది కాదు" అని మిథాలీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

2006 నవంబర్‌లో మహిళల క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏఐ) బీసీసీఐలో విలీనమైన తర్వాత పరిస్థితుల్లో మార్పు మొదలైందని ఆమె వివరించారు. తొలుత సిరీస్‌కు కొంత మొత్తం, ఆ తర్వాత మ్యాచ్‌కు ఇంత అని ఫీజులు ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు.

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్టోబర్ 2022 నుంచి బీసీసీఐ పురుష, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజు విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం, ఒక టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున క్రీడాకారిణులకు చెల్లిస్తున్నారు. ఒకప్పుడు ఫీజులు కూడా లేని స్థాయి నుంచి నేడు పురుషులతో సమానంగా వేతనాలు అందుకోవడం, ప్రపంచకప్‌ గెలిచి కోట్లాది రూపాయల బహుమతులు అందుకోవడం మహిళల క్రికెట్‌లో వచ్చిన అద్భుతమైన మార్పునకు నిదర్శనం. 
Mithali Raj
Indian Women's Cricket
BCCI
Womens Cricket Association of India
WCAI
Cricket Remuneration
Equal Pay
Womens World Cup
Cricket History
Match Fees

More Telugu News