Nara Bhuvaneswari: లండన్‌లో నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాల స్వీకరణ

Nara Bhuvaneswari Honored with Prestigious Awards in London
  • లండన్‌లో 'డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025' పురస్కార ప్రదానం
  • హెరిటేజ్ ఫుడ్స్‌ కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరణ
  • ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలకు దక్కిన ప్రత్యేక గుర్తింపు
  • కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
  • ఒకే వేదికపై సేవ, వ్యాపార రంగాల్లో రెండు పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ఆమె రెండు పురస్కారాలను స్వీకరించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ఆమెకు 'డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025'ను ప్రదానం చేయగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన 'గోల్డెన్ పీకాక్' అవార్డును కూడా ఆమె అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో భువనేశ్వరి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ 'డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌'ను అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు వంటి ఎన్నో సేవలను ఆమె అందిస్తున్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తమార్పిడి చేయించడం, విద్యార్థులకు సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడం వంటి కార్యక్రమాలతో ఆమె ప్రజల మన్ననలు పొందారు.

మరోవైపు, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆ సంస్థ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. హెరిటేజ్‌ను దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలబెట్టడంలో, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడంలో, రైతుల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఆమె కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే 'ఎక్స్‌లెన్స్‌ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌' విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 'గోల్డెన్ పీకాక్' అవార్డు లభించింది. సంస్థ తరఫున భువనేశ్వరి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఒకే వేదికపై సేవ, వ్యాపార రంగాల్లో భువనేశ్వరి పురస్కారాలు అందుకోవడం విశేషం. కాగా, ఈ సందర్భంగా అర్ధాంగి భువనేశ్వరిని ప్రశంసిస్తూ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. 
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Heritage Foods
NTR Trust
Distinguished Fellowship 2025
Golden Peacock Award
London
Telugu News
Women Empowerment
Corporate Governance

More Telugu News