Royal Enfield Bullet 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 'బుల్లెట్ 650' వచ్చేసింది!

Royal Enfield Bullet 650 Unveiled at EICMA 2025
  • మిలాన్ EICMA 2025లో బుల్లెట్ 650 ఆవిష్కరణ
  • 648సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి రాక
  • భారత్‌లో 2026 ప్రథమార్ధంలో విడుదలయ్యే అవకాశం
  • సుమారు రూ. 3.4 లక్షల నుంచి ధర ప్రారంభం అంచనా
  • క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్ల అద్భుతమైన కలయిక
  • రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, బైక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ 650 మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA 2025 మోటార్ షో వేదికగా ఈ సరికొత్త బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ విభాగంలో ఇంటర్‌సెప్టార్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మీటియోర్, షాట్‌గన్, బేర్, క్లాసిక్ 650 తర్వాత మరో శక్తిమంతమైన మోడల్ చేరినట్లయింది.

ఈ కొత్త బుల్లెట్ 650ని 'కానన్ బ్లాక్', 'బ్యాటిల్‌షిప్ బ్లూ' అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో విడుదల చేశారు. తొలుత ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే, ఉత్తర అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయానికి ఉంచి, ఆ తర్వాత 2026 ప్రథమార్ధంలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. మన దేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.4 లక్షల నుంచి రూ. 3.7 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నవంబర్ 21 నుంచి గోవాలో జరగనున్న మోటోవర్స్ 2025 ఈవెంట్‌లో కూడా ఈ బైక్‌ను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డిజైన్, ఫీచర్లు

బుల్లెట్ 650 మోడల్ తన వారసత్వ క్లాసిక్ డిజైన్‌ను నిలుపుకుంది. చేతితో గీసిన పిన్‌స్ట్రైప్స్, 3D వింగ్డ్ బ్యాడ్జ్‌లు, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, రైజ్డ్ హ్యాండిల్‌బార్ వంటి అంశాలు పాత బుల్లెట్‌ను గుర్తుకు తెస్తాయి. అదే సమయంలో, క్యాస్కెట్-మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, దానికిరువైపులా అమర్చిన 'టైగర్-ఐ' పైలట్ ల్యాంప్స్ ఆధునికతను జోడించాయి. ముందువైపు 19-అంగుళాల, వెనుక 18-అంగుళాల చక్రాలు ఉన్నాయి.

ఇందులో ఫ్యూయల్ లెవెల్, ట్రిప్ డేటా, గేర్ ఇండికేటర్ వంటి సమాచారం చూపే డిజి-అనలాగ్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అమర్చారు. ముందువైపు 43mm టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. భద్రత కోసం ముందు 320mm, వెనుక 300mm డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఈ బైక్ బరువు 243 కేజీలు కాగా, సీట్ ఎత్తు 800 mmగా ఉంది. 14.8-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు, ప్రయాణికుల సౌలభ్యం కోసం యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇంజిన్ పనితీరు

బుల్లెట్ 650లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే పలు మోడళ్లలో ఉపయోగించి విజయం సాధించిన 648సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7250 rpm వద్ద 46.4 bhp శక్తిని, 5650 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ దీని ప్రత్యేకతలు.

ఈ మోటార్ షోలో బుల్లెట్ 650తో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో రెండు ప్రత్యేక మోడళ్లను కూడా ప్రదర్శించింది. వాటిలో ఒకటి హిమాలయన్ మానా బ్లాక్ ఎడిషన్ కాగా, మరొకటి షాట్‌గన్ x రఫ్ క్రాఫ్ట్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ప్రత్యేక కస్టమ్ బైక్.
Royal Enfield Bullet 650
Royal Enfield
Bullet 650
EICMA 2025
Royal Enfield bikes
650cc bikes India
Motoverse 2025
Cannon Black
Battleship Blue
Indian motorcycle market

More Telugu News