Naxals: నక్సల్స్ కు మరో గట్టి ఎదురుదెబ్బ... ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేసిన డీఆర్‌జీ బలగాలు

Naxals Arms Factory Busted in Sukma Chhattisgarh by DRG Forces
  • ఛత్తీస్‌గఢ్‌ సుక్మా అడవుల్లో మావోయిస్టుల స్థావరం గుర్తింపు
  • రహస్య ఆయుధ ఫ్యాక్టరీపై డీఆర్‌జీ బలగాల మెరుపుదాడి
  • భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు, యంత్రాలు స్వాధీనం
  • లొంగిపోయిన నక్సలైట్ల సమాచారంతోనే ఈ దాడి
  • ఈ ఏడాదే 249 మంది మావోయిస్టులు హతం: ఎస్పీ కిరణ్ చవాన్
  • మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కూడా
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని దట్టమైన అడవుల్లో రహస్యంగా నడుపుతున్న ఆయుధాల తయారీ కర్మాగారాన్ని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. ఈ మెరుపుదాడిలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయిమెంట-ఎరపల్లి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

కొన్ని నెలలుగా మావోయిస్టులు ఈ ఫ్యాక్టరీని అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల సహాయంతో నడిచే ఈ వర్క్‌షాప్‌లో ఆయుధాలను తయారు చేస్తున్నట్లు బలగాలు గుర్తించాయి. దాడి సమయంలో సగం తయారైన 17 నాటు తుపాకులు, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, పెద్ద మొత్తంలో ఉక్కు రాడ్లు, ట్రిగ్గర్ మెకానిజమ్స్, లేత్ మెషీన్లు, వెల్డింగ్ కిట్లు, డ్రిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుపాతరల తయారీకి సిద్ధంగా ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, సర్క్యూట్ బోర్డులను కూడా సీజ్ చేశారు.

ఈ ఆపరేషన్ వివరాలను సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మీడియాకు వెల్లడించారు. కొద్ది వారాల క్రితం లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కచ్చితమైన సమాచారంతోనే ఈ స్థావరాన్ని గుర్తించగలిగామని తెలిపారు. ఆ స్థావరంలో ఆర్మీ రైఫిళ్లతో సరితూగే ఆయుధాలను తయారు చేసేందుకు సంబంధించిన బ్లూప్రింట్లను కూడా కనుగొన్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 249 మంది నక్సలైట్లను మట్టుబెట్టినట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు వంటి అగ్రనేతలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. "వరుస ఎదురుదెబ్బలతో బలహీనపడిన మావోయిస్టులు, ఈ ఫ్యాక్టరీ ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూశారు. కానీ మేం వారి ప్రయత్నాన్ని సమాధి చేశాం" అని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ అనంతరం స్థావరంలోని పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసి, మొత్తం ఫ్యాక్టరీని దగ్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బంది సురక్షితంగా తమ శిబిరానికి చేరుకున్నారు.
Naxals
Chhattisgarh Naxals
Sukma
DRG Forces
Maoist Arms Factory
Anti Naxal Operation
Kiran Chavan SP Sukma
Nambala Keshav Rao
Maoist Encounter

More Telugu News