Koppula Eshwar: రాష్ట్రంలో దళిత ఉద్యమం నిర్మిస్తాం: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar vows to build Dalit movement in Telangana
  • రాష్ట్రంలో దళిత ఉద్యమాన్ని తీసుకొస్తామన్న కొప్పుల
  • కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేకి అని విమర్శ
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు
  • ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణ
  • అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం బంధించిందని వ్యాఖ్య
కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో దళితులను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, అక్కడి దళితులు కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ఆయన సూచించారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను తీవ్రంగా అవమానిస్తోందని, ఎన్నికల ముందు మల్లిఖార్జున ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేసి ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందని అన్నారు. "గరీబీ హఠావో నినాదం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే ఉంది. వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది" అని కొప్పుల ఆరోపించారు.

దళితులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా? అని ఆయన ప్రశ్నించారు. దళితబంధును రూ. 12 లక్షలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్లను కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. "ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బంధించింది. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ అక్కడ నివాళులు అర్పించిన పాపాన పోలేదు" అని కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేకి అని అన్నారు. దళితబంధు సాధన సమితి తరఫున జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
Koppula Eshwar
Dalit Movement
Telangana
BRS Party
Congress Party
Dalit Bandhu
SC Sub Plan
Jubilee Hills
Revanth Reddy
Mallikarjun Kharge

More Telugu News