ఆదిలాబాద్‌లో కవిత పర్యటన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

  • ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం
  • బీఆర్ఎస్ ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న కవిత 
  • కొరాటా-చనకా బ్యారేజీ పనులను పూర్తిచేయడం లేదని ఆరోపణ
  • నిపుణుల సూచనతోనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని వెల్లడి
  • ప్రాణహిత-చేవెళ్లను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని వ్యాఖ్య
 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతోందని మండిపడ్డారు. మంచి చేస్తే మంచి అని, చెడు చేస్తే చెడు అనే చెబుతామని స్పష్టం చేశారు. రెండు రోజుల 'జనం బాట' కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న కొరాటా-చనకా బ్యారేజీ పనులను కవిత పరిశీలించారు. గత ప్రభుత్వం 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టామని గుర్తుచేశారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై మాట్లాడుతూ.. "తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడం సరైంది కాదని నిపుణులే చెప్పారు. వారి సూచన మేరకే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం జరిగింది" అని కవిత వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఒక ఏటీఎంగా మార్చుకుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

తన పర్యటనలో భాగంగా కవిత మొదట ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం జైనథ్ మండలంలో దెబ్బతిన్న తర్నం వంతెనను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని కొమురంభీం కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


More Telugu News