Anil Ambani: అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ... రూ.4,462 కోట్ల విలువైన భూములు అటాచ్ చేసిన ఈడీ

Anil Ambani Suffers Setback ED Attaches Lands Worth Rs 4462 Crore
  • ఆర్‌కామ్ కేసులో ఈడీ కీలక చర్య
  • ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలోని 132 ఎకరాల భూమి అటాచ్‌మెంట్
  • ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.7,545 కోట్లకు పైగా ఆస్తుల జప్తు
  • బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలు
  • కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించిన దర్యాప్తు సంస్థ
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం కీలక చర్యలు తీసుకుంది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో సుమారు 132 ఎకరాల భూమిని తాత్కాలికంగా అటాచ్ చేసింది. దీని విలువ రూ.4,462.81 కోట్లు ఉంటుందని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు మోసం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లకు సంబంధించిన బ్యాంకు మోసం కేసులపై ఈడీ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. గతంలోనే ఈ కేసులకు సంబంధించి రూ.3,083 కోట్లకు పైగా విలువైన 42 ఆస్తులను జప్తు చేసింది. తాజా అటాచ్‌మెంట్‌తో కలిపి ఈ కేసుల్లో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.7,545 కోట్లకు పైగా చేరింది.

ఆర్‌కామ్, అనిల్ అంబానీ, ఇతరులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. 2010-12 మధ్య కాలం నుంచి ఆర్‌కామ్, దాని గ్రూప్ కంపెనీలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు బ్యాంకులకు రూ.40,185 కోట్లు బకాయిపడ్డాయని, ఐదు బ్యాంకులు ఇప్పటికే ఈ రుణ ఖాతాలను మోసపూరితంగా (ఫ్రాడ్) ప్రకటించాయని ఈడీ పేర్కొంది.

ఈడీ దర్యాప్తులో ఆర్‌కామ్ నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు తేలింది. ఒక బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని, మరో బ్యాంకులో ఉన్న ఇతర కంపెనీల రుణాలను తీర్చేందుకు (ఎవర్‌గ్రీనింగ్) ఉపయోగించినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.13,600 కోట్లను ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,600 కోట్లను అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు కనుగొన్నారు. మరో రూ.1,800 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత వాటిని తిరిగి గ్రూప్ సంస్థలకే మళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని దుర్వినియోగం చేసి నిధులను అనుబంధ పార్టీలకు తరలించడంతో పాటు, కొన్ని రుణాలను విదేశాలకు కూడా పంపినట్లు ఆధారాలు లభించాయని ఈడీ తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Anil Ambani
Reliance Communications
RCom
Enforcement Directorate
ED
Bank Fraud
Money Laundering
Dhirubhai Ambani Knowledge City
Navi Mumbai
Assets Attached

More Telugu News