Ponnam Prabhakar: ప్రమాదానికి అదీ కారణమే: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar on Chevella Road Accident Reasons
  • ప్రమాదంపై మంత్రి ఉన్నతస్థాయి సమావేశం
  • ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమన్న పొన్నం
  • రెండు వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందని వెల్లడి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెప్పారు. బస్సు దుర్ఘటనపై ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వరుస ప్రమాదాలు, నివారణ చర్యలపై జూమ్ వేదికగా ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందని చెప్పారు. అయితే అతి వేగం కూడా ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతుందో చూడాలని అన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని అధికారులకు సూచించారు.

రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా, క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. లారీలు ఇసుక, డస్టును తరలిస్తే టార్పాలిన్లు కప్పేలా చూసుకోవాలని సూచించారు. రైతులు ధాన్యం తరలిస్తే వేధింపులకు పాల్పడవద్దని సూచించారు. వాణిజ్య, సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు చేయడం కాదని, నిరంతరం కార్యాచరణ ప్రణాళిక ఉండేలా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రవాణా శాఖ పట్ల ప్రజలకు, ప్రభుత్వంలో గౌరవం పెంపొందించేలా ఉద్యోగులు పనిచేయాలని అన్నారు.

అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు, కార్గో సరుకులు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే రోడ్డు భద్రతా మాసంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అన్నారు.
Ponnam Prabhakar
Chevella road accident
Telangana road accident
Road safety measures
Transport department Telangana

More Telugu News