Adarsh Behera: కిడ్నాపైన భారతీయుడ్ని షారుఖ్ ఖాన్ గురించి అడిగిన సూడాన్ రెబెల్స్

Adarsh Behera Kidnapped Indian Asked About Shah Rukh Khan by Sudan Rebels
  • సూడాన్‌లో ఒడిశాకు చెందిన వ్యక్తి కిడ్నాప్
  • రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మిలీషియా చెరలో భారతీయుడు
  • షారుఖ్ ఖాన్ తెలుసా అంటూ ప్రశ్నిస్తున్న మిలిటెంట్లు
  • తనను కాపాడాలంటూ ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి
  • రెండేళ్లుగా సూడాన్‌లో పనిచేస్తున్న ఆదర్శ్ బెహెరా
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఓ భారతీయుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. అక్కడ ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే మిలీషియా గ్రూప్ అతడిని అపహరించింది. బాధితుడితో బలవంతంగా మాట్లాడిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఆదర్శ్ బెహెరా (36) అనే వ్యక్తిని ఇద్దరు ఆర్ఎస్ఎఫ్ మిలిటెంట్ల మధ్యలో కూర్చోబెట్టినట్లు వీడియోలో ఉంది. వారిలో ఒకరు 'నీకు షారుఖ్ ఖాన్ తెలుసా?' అని ప్రశ్నించగా, మరొకరు ఆర్ఎస్ఎఫ్ నేత దగాలోను పొగడాలంటూ 'దగాలో గుడ్' అని చెప్పమని ఒత్తిడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆర్ఎస్ఎఫ్ మిలీషియాకు మొహమ్మద్ హమ్దాన్ దగాలో అలియాస్ హెమెటి నాయకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, బెహెరా తనను కాపాడాలంటూ ఒడిశా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న మరో వీడియోను అతడి కుటుంబ సభ్యులు పంచుకున్నారు. "నేను అల్ ఫాషిర్‌లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రెండేళ్లుగా ఎన్నో కష్టాలు పడుతూ జీవిస్తున్నాను. నా కుటుంబం, పిల్లలు ఆందోళన చెందుతున్నారు. దయచేసి నన్ను కాపాడండి" అని అతడు ఆ వీడియోలో వేడుకున్నాడు. బెహెరాకు భార్య సుస్మిత, ఇద్దరు (8, 3 ఏళ్లు) కుమారులు ఉన్నారు. అతడు 2022 నుంచి సూడాన్‌లోని సుకరాతి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ ఫాషిర్ నగరం నుంచి బెహెరాను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. దాదాపు 18 నెలల పాటు ముట్టడి తర్వాత ఆర్ఎస్ఎఫ్ దళాలు ఇటీవలే ఈ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక్కడి నుంచి అతడిని ఆర్ఎస్ఎఫ్ కు పట్టున్న నైలా నగరానికి తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ఘటనపై భారత్‌లో సూడాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ అబ్దల్లా అలీ ఎల్టోమ్ స్పందించారు. "అల్ ఫాషిర్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అక్కడి వారితో ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. బెహెరాకు ఎలాంటి హాని జరగకూడదని మేం కోరుకుంటున్నాం. అతడు సురక్షితంగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం" అని మీడియాకు తెలిపారు. 2023 నుంచి సూడాన్ సైన్యం, ఆర్ఎస్ఎఫ్ దళాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల వల్ల దేశంలో 13 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Adarsh Behera
Sudan
Kidnapping
Rapid Support Forces
RSF
Al Fashir
Khartoum
Shah Rukh Khan
Indian Citizen
Sudan Civil War

More Telugu News