మహిళల ప్రపంచకప్ గెలుపు.. భావోద్వేగానికి గురైన రోహిత్.. వీడియో వైరల్

  • తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో చారిత్రక గెలుపు
  • మ్యాచ్‌కు హాజరైన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ
  • మహిళల విజయం చూసి కన్నీళ్లు పెట్టుకున్న హిట్ మ్యాన్
  • రోహిత్ భావోద్వేగపు వీడియో సోషల్ మీడియాలో వైరల్
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల కలలను సాకారం చేస్తూ తొలిసారిగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

ఈ ఉత్కంఠభరితమైన తుది పోరులో సఫారీ జట్టుపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు, కీలకమైన చివరి క్యాచ్‌ను కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే అందుకోవడం విశేషం. నడిన్ డి క్లర్క్‌ను ఔట్ చేసిన ఆ క్యాచ్‌తో స్టేడియంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ చారిత్రక విజయాన్ని వీక్షించేందుకు భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్టేడియానికి హాజరయ్యాడు. మహిళల జట్టు ప్రపంచకప్‌ను గెలిచిన క్షణంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో అతని కళ్లు చెమర్చాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్వదేశంలో ప్రపంచకప్ గెలవడంలో ఉండే ఆనందం, ఫైనల్లో ఓడిపోవడంలో ఉండే బాధ రోహిత్‌కు బాగా తెలుసు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి చవిచూసినప్పుడు కెప్టెన్‌గా రోహిత్ ఎంతగానో నిరాశ చెందాడు. ఇప్పుడు మహిళల జట్టు ఆ కలను నెరవేర్చడంతో తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు.


More Telugu News