2022లో వచ్చిన 'రంగ్ బాజ్' సిరీస్ కి విశేషమైన ఆదరణ లభించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సిరీస్, ఈ సారి సినిమా ఫార్మేట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు ఇతర భాషలలోను అక్టోబర్ 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. 'జీ 5' ద్వారా అందుబాటులోకి వచ్చింది. వినీత్ కుమార్ సింగ్ .. ఆకాంక్ష సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ బీహార్ నేపథ్యంలో 1980 నుంచి 2010 వరకూ కొనసాగుతుంది. పాట్నా పరిధిలోని 'దివాన్' అనే టౌన్ లో ఒక వైపు నుంచి రాజకీయం .. మరోవైపు నుంచి రౌడీయిజం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. షా అలీ బేగ్ (వినీత్ కుమార్ సింగ్) దీపేశ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. దీపేశ్ తల్లి అహల్య, తన కొడుకుతో సమానంగా 'షా అలీ'ని చూస్తుంది. దీపేశ్ పైచదువుల కోసం ఢిల్లీ వెళతాడు.

షా అలీ 'దివాన్'లో ఉంటాడు. దశరథ్ అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పనిచేస్తూ, రాజకీయ నాయకుల కళ్లలో పడతాడు. తాను వాళ్లకి ఉపయోగపడుతూ .. వాళ్లని ఉపయోగించుకుంటూ రాజకీయాల దిశగా అడుగులు వేస్తాడు. ఈ క్రమంలోనే అతనికి 'సన' (ఆకాంక్ష సింగ్) పరిచయమవుతుంది. తన కుటుంబ సభ్యులను ఎదిరించి ఆమె అతణ్ణి వివాహం చేసుకుంటుంది. తాను చేసిన నేరాల నుంచి బయటపడాలంటే, రాజకీయంగా మరింత ఎదగాలని షా అలీ భావిస్తాడు. 

అయితే రాజకీయ పరంగా అతనికి ఆశ్రయం ఇచ్చిన లఖన్ రాయ్ (విజయ్ మౌర్య) ఒక కుంభకోణంలో జైలుకు వెళతాడు. ఆయన స్థానంలో భార్య ముఖ్యమంత్రి అవుతుంది. ఆమెను ఆ గద్దెపై నుంచి దించాలని మాజీ ముఖ్యమంత్రి ముకుల్ (రాజేశ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే జరిగితే తాను జైలుకు వెళ్లవలసి వస్తుందని షా అలీకి తెలుసు. ఇక గతంలో జరిగిన ఒక మర్డర్ కేసులో షా అలీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి 'బ్రిజేశ్' సిద్ధమవుతాడు. తన ఊళ్లో జరుగుతున్న విపరీతాలను గురించి తెలిసి ఢిల్లీ నుంచి దీపేశ్ తిరిగొస్తాడు. అప్పుడు 'దివాన్'లో ఏం జరుగుతుంది? షా అలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: అవసరాలు .. అవకాశాలు .. పదవులు .. హోదాలు .. వ్యామోహాలు .. మొదలైన వాటి చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో నిస్వార్ధం .. నిజాయితీ అనేవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికివారు ఎదిగే క్రమంలో తాము ఏం చేస్తున్నామనేది పెద్దగా పట్టించుకోరు. కానీ చేసిన పాపాలన్నింటికీ దొరికిపోయి శిక్ష అనుభవించే రోజంటూ ఒకటి వస్తుందని చెప్పే కథ ఇది. 

పార్టీలు .. వర్గాలు .. వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు .. ఈ మధ్యలో నలిగిపోయే నిజాయితీ పరులైన పోలీస్ అధికారులు .. తమకి అన్యాయం జరుగుతున్నా భయంతో నోరు విప్పలేని సామాన్య ప్రజలు .. ఇలా ఈ అంశాలన్నింటినీ టచ్ చేస్తూ దర్శకుడు ఈ కంటెంట్ ను నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా సాగుతుంది.
  
ఈ కథలో ప్రధానమైనవిగా ఏడు పాత్రలు కనిపిస్తాయి. ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ప్రవర్తిస్తుంది. రాజకీయాలలో రంగులు ఎలా మారుతుంటూ ఉంటాయనేది దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది. గతాన్ని మరిచిపోనివాడు నిజమైన నాయకుడు. ఆ గతంలో తన ఎదుగుదలకు సాయపడినవారిని కలుపుకుంటూ, వర్తమానంలో ముందుగు సాగేవాడే నిజమైన నాయకుడు అంటూ దర్శకుడు ఇచ్చిన సందేశం కనెక్ట్ అవుతుంది. 

పనితీరు: కథ - స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమాకి మంచి మార్కులు ఇచ్చుకోవచ్చు. అలాగే నటీనటులందరూ కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారనే అనాలి. అభ్యంతరకరమైన సన్నివేశాలకు .. సంభాషణలకు అవకాశం లేకుండా ఈ కంటెంట్ అందించిన విధానం ఆకట్టుకుంటుంది.

నటీనటుల వైపు నుంచి కూడా ఈ సినిమా తన స్థాయిని పెంచుకుందని చెప్పాలి. వాళ్ల ఎంపిక కూడా కరెక్టుగా సరిపోయింది. మనకి పాత్రలే తప్ప ఆర్టిస్టులు కనిపించరు. తెలుగు అనువాదం కూడా నీట్ గా అనిపిస్తుంది. అరుణ్ కుమార్ పాండే కెమెరా పనితనం, స్నేహా ఖన్వల్కర్ నేపథ్య సంగీతం .. నిఖిల్ ఎడిటింగ్ ఈ కథను మరింత బలంగా ముందుకు నడిపించాయి. 

ముగింపు: రౌడీలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. రాజకీయాలు రౌడీలకు అండగా నిలుస్తున్నాయి. ఈ మధ్యలో సామాన్య ప్రజలు నలిగిపోతూనే ఉన్నారు. తమకి న్యాయం చేయడానికి ఎవరూ లేరు .. ఎవరూ రారు అని తెలిసినప్పుడు ఆ సామాన్యులు ఏం చేస్తారు? అనేది ఈ కథకి ముగింపు. ఆలోచింపజేసే ఈ కంటెంట్ ఈ తరహా జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.