భారత మహిళల జట్టుకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా

  • తొలిసారి మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన భారత క్రికెట్ జట్టు
  • ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఉమెన్ ఇన్ బ్లూ
  • విజేతలకు రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
  • 1983 కపిల్ దేవ్ విజయాన్ని గుర్తు చేసిందన్న ఐపీఎల్ ఛైర్మన్
భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

ఈ గెలుపును పురస్కరించుకుని క్రీడాకారిణులు, సహాయక సిబ్బందికి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఇది భారత మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే చారిత్రక విజయమని ఆయన కొనియాడారు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ, "1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని పురుషుల జట్టు సాధించిన విజయాన్ని భారత మహిళలు పునరావృతం చేశారు. ఈ గెలుపు దేశంలో మహిళల క్రికెట్‌కు నూత‌న ఉత్తేజాన్ని ఇస్తుంది" అని ప్రశంసించారు.


More Telugu News