ICC Womens World Cup: మహిళల ప్రపంచకప్ ఫైనల్: ఏపీలో క్రికెట్ మేనియా... లోకేశ్ పిలుపుతో నియోజకవర్గాల్లో స్క్రీన్స్ ఏర్పాటు

ICC Womens World Cup Final AP Cricket Fever Nara Lokesh Screens
  • మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఢీ
  • ఏపీ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్, నియోజకవర్గాల్లో బిగ్ స్క్రీన్లు
  • దేశంలోనే తొలిసారిగా విజయవాడలో మహిళా క్రికెట్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు
  • ఆంధ్రా అమ్మాయి శ్రీ చరణి ఆడుతున్న నేపథ్యంలో పెరిగిన ఉత్సాహం
  • టీమిండియా గెలుపు కోసం తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు
  • ప్రజాప్రతినిధుల చొరవతో ఊరూరా క్రికెట్ మ్యాచ్ వీక్షణకు ఏర్పాట్లు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టైటిల్ పోరును వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పల్లె నుంచి పట్నం దాకా సందడి వాతావరణం నెలకొంది.

దేశంలోనే తొలిసారిగా విజయవాడలో ఫ్యాన్ పార్క్

ఈ ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళుతూ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) విజయవాడలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా క్రికెట్ మ్యాచ్ కోసం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రత్యేకంగా 'ఫ్యాన్ పార్క్'ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై మ్యాచ్ చూసేందుకు నగరవాసులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, "భారత జట్టు ఫైనల్‌కు చేరడం గర్వకారణం. అందులోనూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారిణి శ్రీ చరణి ఆడటం మాకు రెట్టింపు సంతోషాన్నిస్తోంది. అభిమానులంతా ఇక్కడికి వచ్చి టీమిండియాకు మద్దతు తెలపాలి" అని కోరారు.

తిరుమలలో ప్రత్యేక పూజలు

మరోవైపు, భారత జట్టు ప్రపంచకప్ గెలవాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు డాలర్స్ దివాకర రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. "ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా మంచి స్కోరు చేసి, వికెట్లు తీసి, దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించాం" అని తెలిపారు. 
ICC Womens World Cup
Nara Lokesh
Womens World Cup Final
Andhra Pradesh Cricket
Kesineni Sivanath
Sri Charani
Tirumala
Fan Park Vijayawada

More Telugu News