ISRO: ఇస్రో ఖాతాలో బాహుబలి విజయం... సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

ISRO CMS03 Satellite Launch a Grand Success
  • శ్రీహరికోట నుంచి విజయవంతంగా దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్
  • భారత నావికాదళానికి చెందిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్
  • దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌గా గుర్తింపు
  • సుమారు 4,400 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం
  • నేవీ కమ్యూనికేషన్, సముద్ర నిఘా సామర్థ్యాలు మరింత బలోపేతం
  • నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని కచ్చితత్వంతో ప్రవేశపెట్టిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.

నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్, CMS-03 ఉపగ్రహాన్ని కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణ విజయం సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ కచ్చితంగా జరిగిందని వారు తెలిపారు.

GSAT-7Rగా కూడా పిలిచే ఈ CMS-03 ఉపగ్రహం, భారత నావికాదళానికి ఇప్పటివరకు ఉన్నవాటిలో అత్యంత ఆధునికమైనది. ఇది నేవీ యొక్క అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను, సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేయనుంది. నావికాదళం కార్యాచరణ అవసరాలకు తగినట్లుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక అత్యాధునిక భాగాలను ఇందులో అమర్చారు.

సుమారు 4,400 కిలోల బరువున్న ఈ శాటిలైట్, భారతదేశం ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో అత్యంత బరువైనది కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడినట్లయింది.
ISRO
CMS-03
Indian Space Research Organisation
LVM3-M5
Sriharikota
Satish Dhawan Space Center
Indian Navy
GSAT-7R
Communication Satellite
Space Program

More Telugu News