నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎమ్-3 రాకెట్
- శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్
- దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం సక్సెస్
- సుమారు 4400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన LVM3
- చంద్రయాన్-3 ప్రయోగించిన రాకెట్ తోనే ఈ ప్రయోగం చేపట్టడం విశేషం
- భారత్, సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించనున్న CMS-03
CMS-03 ఉపగ్రహం బరువు సుమారు 4400 కిలోలు. భారత భూభాగం నుంచి జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి (GTO) ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం ద్వారా భారతదేశంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఈ ప్రయోగం దేశీయ టెలికమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ రంగాలకు గొప్ప ఊతాన్ని ఇవ్వనుంది.
ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. రాకెట్, ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 26నే దానిని ప్రయోగ వేదికపైకి తరలించారు. ప్రయోగానికి ముందు అన్ని దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, నిర్దేశిత సమయంలో రాకెట్‌ను నింగిలోకి పంపారు. చంద్రయాన్-3 తర్వాత LVM3 రాకెట్ మరోసారి తన సత్తాను నిరూపించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.