London train attack: లండన్ రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి

Knife Attack on London Train Leaves 10 Injured
  • పది మందికి కత్తిపోట్లు.. అందులో 9 మంది పరిస్థితి విషమం
  • ఇద్దరు అనుమానితుల అరెస్టు
  • లండన్ హంటింగ్ డన్ రైల్వే స్టేషన్లో ఘటన
ఇంగ్లాండ్ లో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ ట్రైన్ లో ఓ దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

శనివారం అర్ధరాత్రి కేంబ్రిడ్జి యూనివర్సిటీ సమీపంలోని హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు లండన్ కు వెళ్తుండగా ఓ దుండగుడు ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో టాయిలెట్లలో దాక్కున్నారు. కత్తిపోట్ల కారణంగా ప్రయాణికుల రక్తంతో రైలు బోగీ తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పొడవాటి కత్తితో దుండగుడిని చూశామని, కత్తితో విచక్షణారహితంగా ప్రయాణికులపై దాడి చేశాడని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు.

ప్రయాణికుల సమాచారంతో వెంటనే హంటింగ్ డన్ స్టేషన్ చేరుకున్న పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కత్తిపోట్లకు గురైన ప్రయాణికులను అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలించారు. బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు కూడా కత్తిపోట్లను అత్యంత భయంకరమైన దాడిగా ప్రకటించారు. ఈ దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉందా అనే దిశగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, రైలులో కత్తిపోట్ల ఘటనపై ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ దాడి అత్యంత విచారకరమని, బాధితులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ సిబ్బందికి ఆయన థ్యాంక్స్ చెప్పారు.
London train attack
UK train stabbing
Huntingdon stabbing
Keir Starmer
England train attack
British Transport Police
Cambridge University
Huntingdon Railway Station
UK crime

More Telugu News