Arcelor Mittal: ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు.. రూ.1.5 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌కు లైన్ క్లియర్

Arcelor Mittal Nippon Steel Plant Cleared in Andhra Pradesh
  • అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు
  • రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న పరిశ్రమ
  • దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారంగా రికార్డు
  • విశాఖ పార్టనర్‌షిప్ సదస్సులో శంకుస్థాపన కార్యక్రమం
  • రికార్డు సమయంలో అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
  • లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న మంత్రి నారా లోకేశ్‌
పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ ముందడుగు వేసింది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ - నిప్పన్ స్టీల్స్ (AM/NS) ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (MoEF) నుంచి కీలక అనుమతులు లభించాయి. రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) సిఫారసు చేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారానికి మార్గం సుగమమైంది.

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ వేదికగా ఈ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ నిర్వహించనున్నారు. AM/NS ఈ కర్మాగారాన్ని పలు దశల్లో అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నిర్మించి, భవిష్యత్తులో దీనిని 24 మిలియన్ టన్నుల వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణానికి అతి తక్కువ హాని కలిగించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కర్మాగారాన్ని నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేయడం విశేషం. కేవలం 14 నెలల్లోనే అన్ని ప్రధాన అనుమతులు పూర్తికావడం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుకు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో మంత్రి నారా లోకేశ్‌ AM/NS ప్రతినిధులతో చర్చలు జరపగా, కేవలం మూడు నెలల్లోనే ప్రభుత్వం భూమిని కేటాయించి, సింగిల్-విండో విధానంలో పూర్తి సహకారం అందించింది.

ఈ సందర్భంగా ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ.. "మేము కోరిన వెంటనే భూమి కేటాయించి, అనుమతులు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన వేగం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇది కేవలం ఉక్కు కర్మాగారం కాదు, ఆవిష్కరణలు, సుస్థిరత, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం" అని తెలిపారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. "అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు రావడం ప్రభుత్వ పారదర్శకతకు, సమర్థతకు నిదర్శనం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఈ ప్లాంట్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు రానున్నాయి. స్థానిక ఉత్పాదకత, ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి" అని వివరించారు. ఈ ప్రాజెక్టుతో విజయనగరం-అనకాపల్లి-కాకినాడ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెంది, దేశ ఉక్కు ఉత్పత్తిలో ఏపీ కీలక రాష్ట్రంగా మారనుంది.
Arcelor Mittal
Andhra Pradesh steel plant
Anakapalle steel plant
Nippon Steel
AP industrial development
Nara Lokesh
Chandrababu Naidu
Visakhapatnam CII Partnership Summit
Steel industry India
Greenfield steel plant

More Telugu News