Chandrababu: టీమ్ స్పిరిట్.. టెక్నాలజీతో మొంథాపై విజయం: సీఎం చంద్రబాబు

Chandrababu Team Spirit Technology Wins Over Montha Cyclone
  • మొంథా తుపాన్ యోధులను సత్కరించిన సీఎం చంద్రబాబు
  • టీమ్ స్పిరిట్‌తోనే తుపాన్ నష్టాన్ని తగ్గించగలిగామ‌ని వెల్ల‌డి
  • టెక్నాలజీ, ఏఐ సాయంతో విపత్తును ఎదుర్కొన్నామ‌న్న సీఎం
  • భవిష్యత్ కార్యాచరణ కోసం మాన్యువల్ రూపొందిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేస్తామ‌న్న చంద్ర‌బాబు
  • డ్రోన్ల ద్వారా పలువురి ప్రాణాలు కాపాడామన్న ముఖ్య‌మంత్రి
మొంథా తుపాన్‌ను టీమ్ స్పిరిట్, ఆధునిక టెక్నాలజీతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో పెను నష్టాన్ని నివారించగలిగామని ఆయన ప్రశంసించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తుపాన్ సమయంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన 137 మంది 'మొంథా ఫైటర్ల'ను ఆయన సత్కరించి, మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం. ఈసారి తుపాన్ నష్టాన్ని తగ్గించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుందనడానికి ఈ విజయమే నిదర్శనం. ఈ అనుభవాన్ని భవిష్యత్తులో విపత్తుల నిర్వహణ కోసం ఒక మాన్యువల్‌గా రూపొందిద్దాం" అని పిలుపునిచ్చారు.

టెక్నాలజీతో నష్ట నివారణ
తుపాన్ల సమయంలో టెక్నాలజీ వినియోగంపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్, 'అవేర్ 2.0' వ్యవస్థ ద్వారా తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. మానిటరింగ్, అలెర్ట్, రెస్క్యూ, పునరావాసం, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ అనే ఐదు సూత్రాల ఫార్ములాతో నష్టాన్ని తగ్గించగలిగాం. రియల్ టైమ్‌లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశాం" అని వివరించారు. సమర్థ నీటి నిర్వహణతో రాయలసీమలో కరువును జయించినట్లే, టెక్నాలజీతో కోస్తాంధ్ర తుఫాన్ల ప్రభావాన్ని తగ్గిస్తున్నామని అన్నారు.

క్షేత్రస్థాయిలో సమష్టి కృషి
తుపాన్ సమయంలో చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి కొనియాడారు. "డ్రోన్ల సహాయంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాం. పర్చూరు వాగులో చిక్కుకున్న షేక్ మున్నాను, ఒక ప్రార్థనా మందిరంలో ఉన్న 15 మందిని రక్షించిన విషయాన్ని గుర్తుచేశారు. ముందస్తుగానే 602 డ్రోన్లను సిద్ధం చేశామని, కాలువల్లో పూడిక తీయడం వల్ల భారీ వర్షాలకు కూడా వరద ముప్పు తగ్గిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అంతా కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది" అని తెలిపారు.

త్వరలో గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థ
త్వరలోనే రాజధాని నుంచే నేరుగా గ్రామ స్థాయి వరకు హెచ్చరికలు పంపే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాశ్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Relief
Technology
AI Models
Aware 2.0
Disaster Management
Team Spirit

More Telugu News