ప్రజల కోసమే పనిచేశా.. కుటుంబం కోసం ఏమీ చేయలేదు: సీఎం నితీశ్ వీడియో సందేశం

  • మరో అవకాశం ఇవ్వాలని బీహార్ ప్రజలను కోరిన సీఎం నితీశ్
  • 2005 నుంచి నిజాయతీగా, కష్టపడి పనిచేశానని వెల్లడి
  • ఒకప్పుడు బిహారీగా చెప్పుకోవడం అవమానంగా ఉండేదని వ్యాఖ్య
  • ఇప్పుడు బిహారీ అంటే గౌరవంగా మారిందన్న నితీశ్ కుమార్
  • మరో అవకాశం ఇస్తే.. బీహార్‌ను టాప్ స్టేట్‌గా మారుస్తాన‌న్న సీఎం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ శనివారం ప్రజల కోసం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2005 నుంచి తాను రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా, కష్టపడి సేవ చేశానని పేర్కొంటూ.. రానున్న ఎన్నికల్లో తమకే మరో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... "నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా, 2005 నుంచి నాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మేము అధికారం చేపట్టే నాటికి బీహార్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ రోజుల్లో బిహారీగా చెప్పుకోవడం ఒక అవమానంగా భావించేవారు. అప్పటి నుంచి రేయింబవళ్లు నిజాయితీగా, కష్టపడి మీ కోసం పనిచేశాను" అని అన్నారు.

గత ప్రభుత్వాలు మహిళల కోసం ఏమీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం మహిళలను ఎవరిపైనా ఆధారపడని విధంగా శక్తిమంతులుగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, యువతకు అవకాశాలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని వివరించారు. 

"హిందూ, ముస్లిం, అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు అనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం మేము పనిచేశాం. నా రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశా, కుటుంబం కోసం ఏమీ చేయలేదు" అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.

2024లో బీజేపీతో కలిసి రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్, "ఒకప్పుడు అవమానంగా ఉన్న 'బిహారీ' అనే పదం ఇప్పుడు గౌరవంగా మారింది" అని అన్నారు. "మాకు మరో అవకాశం ఇవ్వండి. బీహార్‌ను దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకు మరింతగా కృషి చేస్తాం" అని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.

కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల‌ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.


More Telugu News