ట్రోఫీ వివాదం మరువకముందే.. ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ ఢీ

  • ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో తలపడనున్న ఇరు జట్లు
  • నవంబర్ 16న దోహా వేదికగా హైవోల్టేజ్ మ్యాచ్
  • సీనియర్ల ఆసియా కప్ ట్రోఫీ వివాదం తర్వాత తొలి పోరు
  • ఇండియా-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు ఒకే గ్రూప్‌లో
  • నవంబర్ 14 నుంచి 23 వరకు జరగనున్న టోర్నమెంట్
ఇటీవల ముగిసిన ఆసియా కప్ టీ20 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై గెలిచినా.. టీమిండియాకు ట్రోఫీని అందజేయని వివాదం ఇంకా సజీవంగానే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గా ఉన్న పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వడానికి నిరాకరించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాకముందే, దాయాదుల మధ్య మరో పోరుకు రంగం సిద్ధమైంది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు తలపడనున్నాయి. గతంలో ఎమర్జింగ్ ఆసియా కప్‌గా పిలిచిన ఈ టోర్నీకి కొత్త పేరు పెట్టారు. తాజాగా ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఏసీసీ ప్రకటించింది. నవంబర్ 14 నుంచి 23 వరకు ఖతార్‌లోని దోహాలో ఉన్న వెస్ట్ ఎండ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

నవంబర్ 16న అసలు సిసలైన పోరు
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. టెస్టు హోదా ఉన్న దేశాల 'ఎ' జట్లతో పాటు, అసోసియేట్ దేశాల సీనియర్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లను ఒకే గ్రూప్‌ (గ్రూప్-బి)లో చేర్చారు. ఈ గ్రూప్‌లో యూఏఈ, ఒమన్ జట్లు కూడా ఉన్నాయి. నవంబర్ 16న భారత్-ఎ, పాకిస్థాన్-ఎ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇక గ్రూప్-ఎలో బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లతో పాటు హాంగ్ కాంగ్ చైనా ఉంది.

సీనియర్ల ఆసియా కప్‌లో ఉన్న గ్రూపులనే ఇక్కడ కూడా కొనసాగించినా, ఫార్మాట్‌లో మార్పు చేశారు. సూపర్-4 దశకు బదులుగా, గ్రూప్ దశలో టాప్ జట్ల మధ్య నేరుగా సెమీ ఫైనల్స్ నిర్వహిస్తారు. అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి.

కాగా, ఇదే సమయంలో భారత-ఎ జట్టు మరో సిరీస్‌లో కూడా పాల్గొనడం గమనార్హం. నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మరోవైపు, భారత సీనియర్ జట్టు నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. దీంతో ఒకేసారి రెండు భారత-ఎ జట్లు వేర్వేరు ఫార్మాట్లలో బరిలోకి దిగనున్నాయి.


More Telugu News