ఏపీ ఫోరెన్సిక్ అధికారి ఫణిభూషణ్‌ కి కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం

  • ప్రతిష్ఠాత్మక "కేంద్రీయ గృహమంత్రి దక్షత" పతకానికి ఎంపిక
  • ఫణిభూషణ్‌ను అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • రాష్ట్రానికి ఇది గర్వకారణమని డీజీపీ ప్రశంస
  • 28 ఏళ్లుగా ఫోరెన్సిక్ విభాగంలో విశిష్ట సేవలు
  • సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా ఈ పురస్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఏపీఎఫ్ఎస్ఎల్) డీఎన్ఏ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి ఫణిభూషణ్, 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక "కేంద్రీయ గృహమంత్రి దక్షత" పతకానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించింది. 

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫణిభూషణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఎంపిక రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. "ఫోరెన్సిక్ విభాగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, నిధుల కేటాయింపు, ఆధునిక పరికరాల లభ్యత, నేరస్థుల పరిశీలనలో మెరుగైన మార్గదర్శకాల వంటివి ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న నివేదికలను కూడా త్వరితగతిన అందిస్తుండటం కేసుల పరిష్కారానికి దోహదపడుతోంది" అని డీజీపీ వివరించారు. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, విధి నిర్వహణలో నిబద్ధత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలు ప్రదర్శించే అధికారులను ప్రోత్సహించేందుకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఫణిభూషణ్ గత 28 సంవత్సరాలుగా ఫోరెన్సిక్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు.

ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ పాలరాజు, ఐజీపీ అభిలష కూడా ఫణిభూషణ్‌కు అభినందనలు తెలిపారు. సంక్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News