రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు.. హిట్‌మ్యాన్‌ను దాటేసిన బాబర్

  • టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు సృష్టించిన బాబర్ ఆజం
  • భారత బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన పాక్ క్రికెట‌ర్‌
  • దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత 
  • అంత‌ర్జాతీయ టీ20ల్లో 4,234 ప‌రుగుల‌తో టాప్‌లో బాబ‌ర్‌
పాకిస్థాన్ క్రికెట‌ర్‌ బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ రికార్డు (4,231 పరుగులు)ను అధిగమించడానికి బాబర్‌ కేవలం 9 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన బాబర్, స్పిన్నర్ డొనోవన్ ఫెరీరా బౌలింగ్‌లో లాంగ్-ఆఫ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బాబర్, తన టీ20 పరుగుల సంఖ్యను 4,234కి పెంచుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే, పాక్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్ బౌలర్లు సల్మాన్ మీర్జా, ఫహీమ్ అష్రఫ్ కలిసి ఏడు వికెట్లు పడగొట్టి సఫారీ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, యువ ఓపెనర్ సయీమ్ అయూబ్ (38 బంతుల్లో 71 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

దాదాపు ఏడాది తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన బాబర్ ఆజం, తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కానీ, రెండో మ్యాచ్‌లో రికార్డు సృష్టించి సత్తా చాటాడు. బాబర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 130 టీ20లు ఆడి 3 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అయితే, అతని 129 స్ట్రైక్ రేట్‌పై తరచూ విమర్శలు వస్తుంటాయి. మరోవైపు, 159 టీ20లు ఆడిన రోహిత్ శర్మ, గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్న విష‌యం తెలిసిందే. 


More Telugu News