తిరువూరు రగడపై సీఎం చంద్రబాబు స్పందన

  • కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు తీవ్ర అసహనం
  • విభేదాల వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగింత
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య బహిరంగంగా నడుస్తున్న వివాదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని తక్షణమే పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
 
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు, పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొలికపూడి, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని, వారి నుంచి పూర్తి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని, ఆలోగా వివాదం సద్దుమణగకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.


More Telugu News