1 కిలోకు పైగా బంగారం, రూ. 8 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!

  • జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద రూ. 4 కోట్లకు పైగా విలువ చేసే 16 ఫిక్స్‌డ్ డిపాజిట్లు
  • భార్య పేరు మీద కిలో బంగారు ఆభరణాలు
  • చండీగఢ్‌లో ఇల్లు, గోల్పురా గ్రామంలో వ్యవసాయ భూమి
భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్, తన భార్యతో కలిసి రూ. 8 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, న్యూఢిల్లీ, చండీగఢ్, గురుగ్రామ్‌లలో ఇళ్ళు సహా ఆస్తులు మరియు 1.1 కిలోల బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారు.

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. 2025 నవంబర్ 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న ఆయన 14 నెలల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపర్చారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు మీద మొత్తం 16 ఫిక్స్‌డ్ డిపాజిట్ రిసీట్స్‌ ఉన్నాయి. వడ్డీతో కలిపి వాటి విలువ రూ.4,11,22,395 కాగా, ఆయన కుటుంబం పేరు మీద రూ.1,92,24,317 విలువైన మరో 15 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, భార్య పేరు మీద రూ.1,96,98,377 విలువైన 6 ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రిసీట్స్‌ ఉన్నాయి.

జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా 100 గ్రాముల బంగారం, భార్య కిలో బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారు. వారి వద్ద 6 కిలోల వెండి సామాగ్రి ఉంది. ఆయన పేరు మీద ఎలాంటి కారు లేదు. కానీ భార్య పేరు మీద వ్యాగనార్ కారు ఉంది.

చండీగఢ్‌లోని సెక్టార్ 10లో భార్య పేరు మీద ఒక ఇల్లు, పంచకుల జిల్లాలోని గోల్పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి, న్యూచండీగఢ్‌లో 500 చదరపు గజాల స్థలం, న్యూఢిల్లీలోని జీకే-1లో 285 చదరపు గజాల ఇల్లు, గురుగ్రామ్‌లో 300 చదరపు గజాల స్థలం, చండీగఢ్‌లోని సెక్టార్ 18లో 192 చ.గ. స్థలం కలిగి ఉన్నారు. హిసార్ జిల్లాలోని పెట్వార్ గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

ఇద్దరు కుమార్తెల వద్ద 100 గ్రాముల చొప్పున బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేగాక పెద్ద కుమార్తె పేరు మీద రూ.34,22,347 విలువ చేసే 8 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న కుమార్తె పేరు మీద రూ.25,20,665 విలువచేసే 7 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు కలిగి ఉన్నారు.


More Telugu News