Maharshi Dayanand University: దారుణం.. నెలసరికి రుజువు చూపించాలన్న పై అధికారులు!

Maharshi Dayanand University supervisors demand proof of menstruation
  • హర్యానాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో దారుణ ఘటన
  • నెలసరిలో ఉన్నామని చెప్పిన మహిళా పారిశుద్ధ్య కార్మికులను నమ్మని అధికారులు
  • రుజువు కోసం బట్టలు విప్పి ఫోటోలు ఇవ్వాలని సూపర్‌వైజర్ల ఒత్తిడి
  • ఘటనపై విద్యార్థి సంఘాలు, సిబ్బంది తీవ్ర నిరసనలు, ఆందోళనలు
  • ఒక సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసిన వర్సిటీ, ఇద్దరిపై కేసు నమోదు
  • లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హర్యానాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో అత్యంత అమానవీయమైన, దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రుతుస్రావం (నెలసరి) కారణంగా నెమ్మదిగా పనిచేస్తున్న ముగ్గురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను వారి సూపర్‌వైజర్లు తీవ్రంగా వేధించారు. వారు చెప్పింది నమ్మకుండా, నెలసరిలో ఉన్నట్లు నిరూపించుకోవడానికి బట్టలు విప్పి, ఫోటోలు తీసి చూపించాలని బలవంతం చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటన రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో అక్టోబర్ 26న జరిగింది. ఈ విషయం బయటపడటంతో విద్యార్థి సంఘాలు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్లలో ఒకరిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కె.కె. గుప్తా ప్రకటించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

అసలేం జరిగిందంటే...!

బాధితుల కథనం ప్రకారం, వినోద్, జితేంద్ర అనే ఇద్దరు సూపర్‌వైజర్లు.. మహిళా కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలసరి కారణంగా అనారోగ్యంగా ఉన్నామని, ఇతర సీనియర్ అధికారుల అనుమతి తీసుకున్నామని చెప్పినా వారు వినిపించుకోలేదు. అబద్ధాలు చెబుతున్నారంటూ నిందించి, నెలసరిలో ఉన్నట్లు నిరూపించుకోవడానికి బట్టలు విప్పాలని ఆదేశించారు. మరో మహిళా ఉద్యోగి ద్వారా వారిని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, శానిటరీ ప్యాడ్ల ఫోటోలు తీయాలని ఒత్తిడి చేశారు.

"నెలసరిలో ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ వ్యక్తిగత భాగాల ఫోటోలు తీయండి అని వారు చెప్పారు. మేమిద్దరం నిరాకరించడంతో మమ్మల్ని దూషించి, ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరించారు" అని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒత్తిడి భరించలేక ఇద్దరు మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లి ఫోటోలు ఇచ్చారని, ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యామ్ సుందర్ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని వారు చెప్పారని వివరించారు.

పోలీసుల చర్యలు

ఈ ఘటనపై ఇద్దరు సూపర్‌వైజర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పీజీఐఎంఎస్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ లాల్ తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద లైంగిక వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, క్రిమినల్ బెదిరింపులు వంటి పలు అభియోగాలతో కేసు నమోదు చేశారు. మహిళల భద్రతకు, గౌరవానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
Maharshi Dayanand University
Haryana University
Menstruation
Harassment
Women workers
Sanitary workers
Sexual harassment
Rohtak
India

More Telugu News