కెనడాలో హత్య కేసు... భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష

  • 2022 అక్టోబర్ 17న హత్యకు గురైన విశాల్ వాలియా
  • విశాల్‌ను కాల్చి చంపి, కారును తగులబెట్టిన నిందితులు
  • ఇద్దరు యువకులకు 17 ఏళ్ల చొప్పున ఇదివరకు శిక్ష ఖరారు
మూడేళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022 అక్టోబర్ 17న వాంకోవర్‌లోని ఒక గోల్ఫ్ క్లబ్‌లో విశాల్ వాలియా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కారులో వెళుతున్న సమయంలో అతడిని కాల్చి చంపిన నిందితులు, ఆ తర్వాత ఆ కారును తగులబెట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా, భారత సంతతికి చెందిన బాలరాజ్ సింగ్ బాస్రాతో పాటు ఇక్బాల్ కాంగ్, డియాండ్రే బాప్టిస్ట్‌లు ఈ హత్య చేసినట్లు తేలింది. సాక్ష్యాధారాలు మాయం చేయడానికి వాహనాన్ని తగులబెట్టినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో ఈ ముగ్గురిని బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి పెరోల్ లేని శిక్షను విధించింది. ఈ కేసులో ఇద్దరు యువకులకు 17 ఏళ్ల చొప్పున శిక్షను న్యాయస్థానం ఇదివరకే ఖరారు చేసింది. తాజాగా, భారత సంతతి వ్యక్తికి శిక్షను ఖరారు చేసింది.


More Telugu News