MS Raju: భగవద్గీతపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలు.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజాసింగ్ విజ్ఞప్తి

MS Rajus Comments on Bhagavad Gita Raja Singh Appeals to Chandrababu
  • భగవద్గీతపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారన్న రాజాసింగ్
  • ఎంఎస్ రాజు బుద్ధిలేని వ్యక్తి, చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి
తెలుగుదేశం పార్టీకి చెందిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తెలంగాణ రాష్ట్ర గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే భగవద్గీతను, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడేందుకు మరొకరు సాహసించరని రాజాసింగ్ అన్నారు.

ఈ మేరకు రాజాసింగ్ శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఎంఎస్ రాజు బుద్ధిలేని వ్యక్తి అని, భగవద్గీతపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించే ముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మంపై విశ్వాసం ఉందో లేదో పరిశీలించాలని కోరారు.

ఎంఎస్ రాజు లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని చంద్రబాబుకు రాజాసింగ్ సూచించారు. ఒక కార్యక్రమంలో ఎంఎస్ రాజు భగవద్గీత ప్రజల జీవితాలను మార్చలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హిందూ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
MS Raju
Bhagavad Gita
Raja Singh
Chandrababu Naidu
TDP
Telugu Desam Party

More Telugu News