వన్డే అత్యుత్తమ భారత బ్యాటర్లు వీరే.. మెక్‌గ్రాత్ టాప్-5 లిస్ట్ ఇదే!

  • వన్డే అత్యుత్తమ భారత బ్యాటర్ల జాబితాను ప్రకటించిన గ్లెన్ మెక్‌గ్రాత్
  • సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టి రోహిత్ శర్మకు రెండో స్థానం
  • విరాట్ కోహ్లీకి అగ్రస్థానం.. సచిన్‌కు మూడో స్థానం కేటాయింపు
  • ధోనీ, యువరాజ్‌లకు నాలుగు, ఐదు స్థానాలు.. సెహ్వాగ్‌కు దక్కని చోటు
  • రోహిత్ గణాంకాలు నమ్మశక్యం కానివని మెక్‌గ్రాత్ ప్రశంస
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ భారత బ్యాటర్ల జాబితాను ప్ర‌క‌టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కాదని, తన టాప్-5 జాబితాలో రోహిత్ శర్మకు రెండో స్థానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అగ్రస్థానం కట్టబెట్టాడు.

మెక్‌గ్రాత్ ప్రకటించిన జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ కు మూడో స్థానం దక్కింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌లకు వరుసగా నాలుగు, ఐదు స్థానాలను కేటాయించాడు. అయితే, విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.

రోహిత్ శర్మను రెండో స్థానంలో ఎంపిక చేయడంపై మెక్‌గ్రాత్ వివరణ ఇచ్చాడు. "నా జాబితాలో రెండో స్థానం రోహిత్ శర్మది. వన్డే క్రికెట్‌లో అతని గణాంకాలు, అతను ఆడిన తీరు నమ్మశక్యం కాదు. మూడు డబుల్ సెంచరీలు, 264 పరుగుల అత్యధిక స్కోరు సాధించడం ఊహకు అందని విషయం. అతని గణాంకాలు అద్భుతం. అతడిని కేవలం వన్డే స్పెషలిస్ట్‌గా చూడటం దురదృష్టకరం. నిజానికి టెస్టుల్లోనూ అతని రికార్డులు మరింత మెరుగ్గా ఉండాల్సింది" అని మెక్‌గ్రాత్ అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ, "అతను చేసిన పరుగులు, సగటు, స్ట్రైక్ రేట్ చూస్తే నమ్మలేం. అందుకే అతనికి నంబర్ వ‌న్‌ స్థానం ఇచ్చాను" అని తెలిపాడు.

ఇదిలాఉంటే.. రోహిత్ శర్మ ఇటీవల మరో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడైన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల 182 రోజుల వయసులో ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి తన కెరీర్‌లో తొలిసారి నంబర్ వ‌న్ ర్యాంకును అందుకున్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించడమే అతని ర్యాంకు మెరుగుపడటానికి కారణమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 101 సగటుతో 202 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదే సిరీస్‌లో గిల్ కేవలం 43 పరుగులు మాత్రమే చేయడంతో ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డాడు. రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా లభించింది.


More Telugu News