తుపాన్ సాయంపై రాజకీయ దుమారం.. అప్పటికి ఇప్పటికి తేడా ఇదేనంటూ వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్

  • మొంథా తుపాన్ బాధితులకు ప్రభుత్వ సాయంపై విమర్శలు
  • కూటమి ప్రభుత్వంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే అసంతృప్తి
  • జగన్ హయాంతో పోలుస్తూ తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్
  • ప్రస్తుత సాయం చాలా తక్కువంటూ ఆరోపణ
  • ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వివరించిన పవన్ కల్యాణ్
  • నిత్యావసరాలతో పాటు కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం
మొంథా తుపాన్ ఏపీని అతలాకుతలం చేస్తున్న వేళ, ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సాయం చాలా తక్కువగా ఉందంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రెండు ప్రభుత్వాల హయాంలో అందించిన సాయాన్ని పోలుస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

"వరదల సమయంలో వైఎస్‌ జగన్ సీఎంగా ఉంటే రూ.2,000–రూ.3,000 నగదుతో పాటు రేషన్ కిట్, ఇంటి నష్టం: రూ.10,000– రూ.1,20,000, పంట నష్టం: రూ.5,000–రూ.10,000(ఎక‌రానికి), మ‌నిషి చ‌నిపోతే రూ. 5,00,000 సహాయం ఇంటి తలుపువద్దకే వ‌చ్చేది. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు ఉన్నందున ఒక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.3,000 ఇస్తున్నారని" ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అయితే, కూటమి ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. కుటుంబంలో ఒక్కరే ఉంటే రూ.1,000 ఇవ్వాలని ఆదేశించారు. బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ మొత్తాన్ని అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. దీంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీకి కూడా భారీ ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కిట్‌లో కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి ఉంటాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,415 రేషన్ షాపుల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని, మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


More Telugu News